డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తన భక్తిని చాటుకున్నారు. బెయిల్‌పై ఉన్న జగన్ త్వరలో జైలుకు వెళ్తాడని బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ హెచ్చరించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం తన మార్క్ పంచ్ విసిరారు. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో నారాయణస్వామి దర్శించుకున్నారు.
అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ చిన్న తప్పు కూడా చేయలేదన్నారు. ఆయనపై అనవసరంగా బురద చల్లారన్నారు. బ్రహ్మదేవుడు దిగి వచ్చినా జగన్‌ను జైలుకు పంపలేరని ఆయన ధీమాగా చెప్పారు.
సీఎం జగన్ ఓ సింహమన్నారు. ఎంత మంది వచ్చినా ఒంటరిగానే ఆయన పోరాడతారని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన సీఎం జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని నారాయణస్వామి అన్నారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్‌ను రూ.75కు, ఆర్థిక పరిస్థితి సహకరిస్తే రూ.50కే ఇస్తామని ప్రకటించడంపై నారాయణస్వామి తీవ్రంగా స్పందించారు. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడా లేక తాగుబోతులకు అధ్యక్షుడా అనేది అర్థం కావడం లేదన్నారు.
చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి డిపాజిట్లు కూడా రావని మోదీ గుర్తించాలని హితవు పలికారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అర్థం కావడం లేదన్నారు.