కరోనా సెకెండ్ వేవ్‌తోనే పీడ విరగడ అయ్యిందనుకుంటే…మూడోది కూడా ముంచుకొస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారత్‌లో ఇప్పుడిప్పుడే పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ తన ప్రతాపాన్ని నెమ్మదిగా చూపుతోంది. ఈ మేరకు స్పష్టమైన ప్రమాద సంకేతాల్ని ఒమిక్రాన్ ఇస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు అప్రమత్తం చేస్తూ కీలక అంశాలు చెప్పుకొచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో కూడా కేసులు పెరుగుతున్నాయన్నారు. తెలంగాణలోనూ గత రెండుమూడు రోజులుగా కేసులు పెరిగాయన్నారు.
ప్రస్తుతం కేసుల పెరుగుదల థర్డ్ వేవ్‌కు సంకేతమన్నారు. సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్ వచ్చే ప్రమాదం ఉందని శ్రీనివాసరావు చెప్పారు. కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తిస్తున్నట్టు ఆయన హెచ్చరించారు. అయితే ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు.
మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. అలాగే వ్యాక్సినేషన్‌తో ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చాన్నారు. మహమ్మారి బారిన పడిన తర్వాత బాధ పడడం కంటే దానికి దూరంగా ఉండడమే ఉత్తమం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్ చేదు అనుభవాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.