రెడ్డి ఓట్లకు చీటీ చించేసిన పవన్ కల్యాణ్!

ఒక కులం వాళ్లందరూ తమ కులానికి చెందిన ఒక నాయకుడిని నమ్ముకుని గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపించేస్తారని అనుకోవడం భ్రమ. మెజారిటీ  ఓట్లు పడవచ్చు. కానీ అదే కులంలో.. ఇతర పార్టీలకు ఓట్లు వేసేవాళ్లు…

ఒక కులం వాళ్లందరూ తమ కులానికి చెందిన ఒక నాయకుడిని నమ్ముకుని గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపించేస్తారని అనుకోవడం భ్రమ. మెజారిటీ  ఓట్లు పడవచ్చు. కానీ అదే కులంలో.. ఇతర పార్టీలకు ఓట్లు వేసేవాళ్లు కూడా పుష్కలంగా ఉంటారు. 

పవన్ కల్యాణ్ బందరు సభలో తన సుదీర్ఘ ప్రసంగంలో దాదాపు సగం సమయానికి పైగా చీదర పుట్టించేలాగా కులాల గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. ఈ ప్రాసెస్ లో భాగంగా.. రెడ్డి కులం మీద తన ద్వేషాన్ని కూడా విషం కక్కినట్టుగా నిస్సిగ్గుగా బయటకు కక్కారు.

ఒకవైపు తనకు అన్ని కులాల్లో అభిమానులున్నారని, తనకు కులాల మధ్య తేడాలు కనిపించవని అంటూనే.. పవన్ కల్యాణ్ మొత్తం కులాల మీద మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. మాటకోసారి రెడ్డి కులం పట్ల ద్వేషాన్ని కూడా వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి జగన్ తన కులం వాళ్లకే 98 శాతం పోస్టులన్నీ కట్టబెట్టేస్తున్నాడంటూ పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. రెడ్లు తప్ప మరెవ్వరికీ పదవులు ఇవ్వడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

అన్ని కులాలు ముఖ్యం అంటూ.. చిన్న సన్న కులు అన్నింటినీ జాబితా రాసుకుని వచ్చి చదివి.. ఆ కులాల వారందరికీ కూడా రాజ్యాధికారం దక్కాలని సన్నాయి నొక్కులు నొక్కిన పవన్ కల్యాణ్ మొత్తానికి రెడ్డి అభిమానుల్ని మాత్రం ఏకపక్షంగా దూరం చేసుకున్నారు. ఆయన ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. రెడ్ల మీద ద్వేషం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 

రెడ్డి ఓటర్లు మాత్రం ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు. అన్నికులాల వాళ్లు కూడా ఆయనను సొంతం చేసుకోబట్టి.. ఆయన చెప్పిన హామీలను నమ్మబట్టి.. ఆయన ప్రజలకోసం మేలు చేస్తారని విశ్వసించబట్టి ఆయనను ముఖ్యమంత్రిని చేశారు. పవన్ కల్యాణ్ విషయమైనా అంతే. ఆయనను అన్ని కులాల వాళ్లు నమ్మబట్టే.. ఆయన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే పవర్ స్టార్ అయ్యారు. 

కానీ.. బలిజ ఉపకులాలు, మాదిగ ఉపకులాలు అంటూ.. సంఖ్యాబలం తక్కువగా ఉండే కులాలను పవన్ పదేపదే ప్రస్తావించారు. మంచిదే.. వారి అబ్యున్నతి గురించి ఆలోచించడం మంచిదే. కానీ పనిగట్టుకుని రెడ్ల మీద విషం కక్కడం ఏమిటో అర్థం కాని సంగతి. 

ఎటూ తనకు రెడ్లు ఓటు వేయరు గనుక.. వారి మీద ఎంతగా విషం చిమ్మినా పరవాలేదని, పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఈ ప్రసంగం నిరూపించింది.