హమ్మయ్య.. ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన చర్చలు

ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది. ఒకట్రెండు మార్గాలు మినహా, మిగిలిన అన్ని దారుల్లో రెండు సంస్థలు మధ్యేమార్గానికొచ్చాయి. దీంతో సామాన్యుడు ఊపిరి పీల్చుకున్నాడు. త్వరలోనే రెండు రాష్ట్రాల మధ్య బస్సు…

ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది. ఒకట్రెండు మార్గాలు మినహా, మిగిలిన అన్ని దారుల్లో రెండు సంస్థలు మధ్యేమార్గానికొచ్చాయి. దీంతో సామాన్యుడు ఊపిరి పీల్చుకున్నాడు. త్వరలోనే రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మొదలుకాబోతున్నాయి.

ప్రస్తుతానికైతే రెండు రాష్ట్రాల ఆర్టీసులు చెరో లక్షా 61వేల కిలోమీటర్ల మేర బస్సులు నడపే విషయంపై ఓ ఒప్పందానికి వచ్చాయి. ఏఏ మార్గాల్లో ఎన్ని కిలోమీటర్లు నడపాలనే అంశంపై రెండు సంస్థలు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాయి. అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ మార్గంపై కూడా క్లారిటీ వచ్చేసింది.

హైదరాబాద్ విజయవాడ మధ్య తెలంగాణ ఆర్టీసీ కంటే 6వేల కిలోమీటర్లు అదనంగా సర్వీసులు నడపడానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదన సిద్ధంచేసింది. ఈ మేరకు కొన్ని మార్గాల్లో సుమారు 10వేల కిలోమీటర్ల మేరకు సర్వీసుల్ని తగ్గించుకోవడానికి సిద్ధపడింది. ఈ వ్యత్యాసంపై చిన్నపాటి తకరారు ఉన్నప్పటికీ శుక్రవారం జరిగే సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చేలా ఉంది.

కర్నూలు-హైదరాబాద్ సర్వీసుపై కూడా దాదాపు ఏకాభిప్రాయం వచ్చేలా ఉంది. ఈ సర్వీసులో బస్సు 90శాతం తెలంగాణలో తిరుగుతుంది, కేవలం 10శాతం మాత్రమే ఏపీలో తిరుగుతుంది. రెండు రాష్ట్రాలు ఈ సర్వీసు నడిపితే.. ఏపీకి తెలంగాణ నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ. అదే సమయంలో తెలంగాణకు ఏపీ నుంచి వచ్చే ఆదాయం తక్కువ. పోనీ కిలోమీటర్ల ప్రకారం నడపాలనుకున్నా.. తెలంగాణ బస్సులు ఏపీలో ఎక్కువగా తిరిగే అవకాశమే లేదు.

ఎట్టకేలకు ఈ అంశాలన్నింటిపై రాజీ కుదిరింది. మొత్తంగా చెరో లక్షా 61వేల కిలోమీటర్ల మేర బస్సులు నడపాలని రెండు ఆర్టీసీలు ఒప్పందానికి వచ్చాయి. తెలంగాణ అధికారులు సూచించిన విధంగా ఏపీ అధికారులు తమ ప్రతిపాదనల్లో చిన్న చిన్న మార్పులు చేస్తే.. శుక్రవారం నాటి సమావేశంలో అగ్రిమెంట్ కుదిరి అవకాశం ఉంది. 

ఒప్పందం కుదిరితే ఆదే రోజు రాత్రి నుంచే బస్సులు నడపాలనే ఆలోచనలో ఏపీఎస్ఆర్టీసీ ఉంది. కానీ దసరాకు బస్సులు నడిపే అంశంపై, ఏపీఎస్ఆర్టీసీతో టీఎస్ఆర్టీసీ విబేధిస్తోంది. దీనిపై రేపటి సమావేశంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బీజేపీ కోసం పవన్ అంత ధైర్యం చేస్తారా?