జనసేన ఆవిర్భావ సభకు కొన్ని గంటల ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్‌ను మచ్చిక చేసుకోడానికే అచ్చెన్నాయుడు పొత్తుపై పరోక్షంగా పాజిటివ్ సంకేతాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నంలో మంగళవారం సాయంత్రం జనసేన సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జనసేన హడావుడి చేస్తోంది.
ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొత్తుపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే దృఢ సంకల్పంతో పవన్ ఉన్నారని, ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలని టీడీపీ – జనసేన పిలుపునిస్తున్నాయని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఈ మాటల వెనుక మర్మం ఏంటో జనానికి బాగా తెలుసు. తెలియందల్లా జనసేనాని, ఆ పార్టీ శ్రేణులకు మాత్రమే.
ఆవిర్భావ సభ రోజు పవన్ గురించి మంచిగా మాట్లాడితే, ఇవాళ అందుకు ప్రతిఫలంగా టీడీపీపై జనసేనాని పాజిటివ్ కామెంట్స్ చేస్తారని టీడీపీ ఆశ, నమ్మకం. ఈ రకమైన పంథాతోనే పవన్‌కల్యాణ్‌ను తమకు అనుకూలంగా టీడీపీ మలుచుకుంది. ఊరికే పొగుడుతూ వుంటే చాలు…. పవన్ తనకు తానే టీడీపీ వెంట పడతారని ఆ పార్టీ నాయకులు పసిగట్టారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. గౌరవ ప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు కుదురుతుందని పవన్‌కల్యాణ్ పదేపదే చిలుక పలుకులు పలుకుతున్నారు.
రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తామనే విషయమై మాత్రం టీడీపీ అంతరంగం బయటపడడం లేదు. మరోవైపు టీడీపీని నమ్ముకుని పవన్‌కల్యాణ్ మిత్రపక్షమైన బీజేపీతో అనధికారికంగా తెగదెంపులు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని పిలుపు ఇవ్వని దుస్థితి.
జనసేనకు సంబంధించి ఇది కీలక సమావేశం కావడంతో ఎంతకైనా మంచిదని మరోసారి పవన్‌పై టీడీపీ వలపు వల విసిరింది. అందులో భాగమే అచ్చెన్నాయుడి తాజా వ్యాఖ్యలుగా గుర్తించుకోవాలి.