ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్‌పై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ పరువు తీస్తున్నాయి. వ్యక్తిగతంగా సోము వీర్రాజుతో పాటు అంతకంటే ఎక్కువగా జాతీయ పార్టీ అయిన బీజేపీకి బాగా నష్టం కలిగిస్తున్నాయనేందుకు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ట్రోలింగ్సే నిదర్శనం. సోము వీర్రాజు చీప్ లిక్కర్ ధరలపై చేసిన కామెంట్స్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
విజయవాడలో నిన్న నిర్వహించిన ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీలో మద్యం తాగే మందుబాబులంతా తమకే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.70కే ఇస్తామని, ఆదాయం బాగుంటే రూ.50కి కూడా ఇస్తామని ఆయన ఆశ చూపారు. మందుబాబులను ప్రసన్న చేసుకోడానికి సోము వీర్రాజు కాస్త సారాయి బీర్రాజు అయ్యారనే సెటైర్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలపై పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో వీర్రాజుతో పాటు బీజేపీని దెప్పి పొడుస్తూ ట్వీట్ చేశారు.
“వావ్…వాట్ ఎ స్కీం. వాట్ ఎ షేమ్. రూ.50కే చీప్ లిక్కర్ బీజేపీ జాతీయ విధానమా? అధికారం కోసం బంపర్ ఆఫర్ ఇస్తున్నారా?” అని వెటకరించారు. కేటీఆర్ ట్వీట్‌ను బట్టి ఏపీ బీజేపీ పరువు ఏ స్థాయిలో పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఏదో చెప్పబోయి, మరేదో మాట్లాడి సోము వీర్రాజు పార్టీని, తనను అభాసుపాలు చేసుకున్నారు. బీజేపీ ప్రజాగ్రహ సభ సాధించిన విజయంగా ప్రత్యర్థులు అభివర్ణిస్తున్నారు.