తమను మొరిగే కుక్కలుగా దూషించిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కమ్యూనిస్టులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. విమర్శల స్థాయిని దాటి, తూలనాడడంపై వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే మద్యపానం రేట్లపై వీర్రాజు వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీర్రాజుకు సరికొత్త పేరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నామకరణం చేశారు. వీర్రాజుకు సారాయి వీర్రాజు అని పేరు పెట్టడం గమనార్హం.
ప్రజాగ్రహ సభలో కమ్యూనిస్టులపై సోము వీర్రాజు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ముందుగా వీర్రాజు ఏమన్నారో చూద్దాం.
“కమ్యూనిస్టులు మొరిగే కుక్కలు. వాళ్ల వల్లే వ్యవస్థ సర్వనాశనమైంది. యూనియన్లు పెట్టి విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. మాకు అధికారమిస్తే చీప్ లిక్కర్ బాటిల్ రూ.70కి.. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే రూ.50కే ఇస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీర్రాజుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా స్పందించారు.
“బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు మతిభ్రమించినట్లుంది. సోము వీర్రాజును ఇకపై సారాయి వీర్రాజుగా పిలవాలేమో!. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ కారుచౌకగా అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించడం దుర్మార్గం. రాష్ట్ర ప్రజలు మద్యనిషేధం కోరుతుంటే, బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటోంది. కోటి మంది మందుబాబులు ఉన్నారని, వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పటం వీర్రాజు పిచ్చికి పరాకాష్ట” అని రామకృష్ణ విరుచుకుపడ్డారు.
వీర్రాజు వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇంత వరకూ స్పందించలేదు. కానీ తమపై అవాకులు చెవాకులు పేలిన వీర్రాజుపై కమ్యూనిస్టు నాయకుడు మాత్రం వెంటనే రియాక్ట్ కావడం విశేషం. భయానికి, నిర్భయానికి వున్న తేడా ఇదే కాబోలు.