దంప‌తుల ఉసురు తీసిన మంచిత‌నం!

మంచిత‌న‌మే ఆ దంప‌తుల ఉసురు తీసింది. స్నేహితుల‌కు మాట సాయం చేయ‌డమే వారి నేర‌మైంది. పూచీ ఉండి అప్పులిప్పించి, వాటిని తీర్చేందుకు ఆస్తుల‌మ్మారు. అయినా అప్పులు తీర‌క‌పోవ‌డం, స‌మాజంలో త‌లెత్తుకోలేని తిర‌గ‌లేమ‌ని తిరిగి రాని…

మంచిత‌న‌మే ఆ దంప‌తుల ఉసురు తీసింది. స్నేహితుల‌కు మాట సాయం చేయ‌డమే వారి నేర‌మైంది. పూచీ ఉండి అప్పులిప్పించి, వాటిని తీర్చేందుకు ఆస్తుల‌మ్మారు. అయినా అప్పులు తీర‌క‌పోవ‌డం, స‌మాజంలో త‌లెత్తుకోలేని తిర‌గ‌లేమ‌ని తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారా దంప‌తులు. త‌మ ఆత్మ‌హ‌త్య‌కు అప్పులే కార‌ణ‌మ‌ని రాసిన లేఖ ప‌లువుర్ని క‌ల‌చివేస్తోంది.

విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట‌లంక‌కు చెందిన పాతూరి ర‌త్త‌య్య (62), పాతూరి నీర‌జ (56) దంప‌తుల‌కు ఏకైక కుమారుడు రాహుల్‌. అత‌ను కెనడాలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. ర‌త్త‌య్య‌కు జి.కొండూరులో సొంతంగా క్ర‌ష‌ర్ ఉంది. త‌మ వ‌ర‌కైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ త‌మ వ్యాపార భాగ‌స్వాములైన వెంక‌టేశ్వ‌ర‌రావు, శ్రీ‌దేవిల‌కు పూచీ ప‌డ‌డమే ర‌త్త‌య్య దంప‌తుల ప్రాణాల మీద‌కు తెచ్చింది.

తాను పూచీ వ‌హించి వెంకటేశ్వరరావు, శ్రీదేవి దంప‌తుల‌కు ర‌త్త‌య్య అప్పులు ఇప్పించారు. ఆ అప్పులను తీర్చలేదు. దీంతో ఆ అప్పుల‌ను తానే చెల్లించాల్సి వ‌చ్చింది. ఇందుకోసం రత్తయ్య సొంత క్రషర్‌ను, ఇల్లుతో పాటు ఇతర ఆస్తులను అమ్ముకున్నారు. అయినా అప్పులు తీరలేదు. అనంత‌రం గుంటూరు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెంవద్ద తన బంధువుల క్రషర్‌లో రత్తయ్య మేనేజరుగా ఉద్యోగంలో చేరారు. అనారోగ్యం కారణంగా సెలవుపెట్టి 5 నెలల క్రితం ఇంటికి వెళ్లారు. సొంతూరులో ఉండలేక తాడేపల్లిలో అద్దెకు ఉంటున్నారు. మ‌రోవైపు అప్పుల వాళ్ల ఒత్తిళ్లు. స‌మాజంలో తలెత్తుకుని తిర‌గ‌లేని ప‌రిస్థితి.

ఇలాంటి బ‌తుకు కంటే చావే న‌య‌మ‌ని దంప‌తులు భావించారు. మూడు రోజుల క్రితం ర‌త్త‌య్య‌, నీరజ దంపతులిద్దరూ తాడేపల్లిలోని నివాసం నుంచి ద్విచక్ర వాహనంపై ఈపూరు మండలం ముప్పాళ్ల వద్దకు చేరుకున్నారు. వాహనాన్ని అద్దంకి బ్రాంచి కాల్వకట్టపై ఉంచి ఇద్దరూ కాల్వలో దూకి ప్రాణాలు విడిచారు. రత్తయ్య దంపతులు కనిపించకపోవడంతో ఆయన తోడల్లుడు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెళ్లి ఇంటిని పరిశీలించగా సూసైడ్‌ నోట్‌ దొరికింది.  

వెంకటేశ్వరరావు, శ్రీదేవిలకు హామీ ఉండి ఇప్పించిన అప్పు వడ్డీతో రూ.3 కోట్లు అయిందని అందులో రాశారు. అలాగే తీసుకున్నవాళ్లు ఎగ్గొట్టడంతో ఆస్తులు అమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయినా తీరలేదని, సమాజంలో తలెత్తు కోలేకపోతున్నామని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని బాధాత‌ప్త హృద‌యంతో రాయ‌డాన్ని పోలీసులు గుర్తించారు. వ్యాపార భాగ‌స్వాముల బాగు కోరి అప్పులిప్పించడం, వాటిని తిరిగి చెల్లించ‌లేక చివ‌రికి త‌మ ప్రాణాల మీద‌కే తెచ్చుకున్న ర‌త్త‌య్య దంప‌తుల విషాద‌గాధ స‌మాజాన్ని కంట త‌డి పెట్టిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితి ఎవ‌రికీ రాకూడ‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.