మింగలేకపోతే కక్కేయొచ్చు కదా దిల్ రాజూ!

సంక్రాంతి సినిమాలన్నీ దిల్ రాజువే. కొన్నింటికి డిస్ట్రిబ్యూషన్, మరో సినిమాకు సహ-నిర్మాత కూడా. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సినిమాలన్నీ దిల్ రాజు చుట్టూనే తిరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రెండు పెద్ద సినిమాల హీరోలు…

సంక్రాంతి సినిమాలన్నీ దిల్ రాజువే. కొన్నింటికి డిస్ట్రిబ్యూషన్, మరో సినిమాకు సహ-నిర్మాత కూడా. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సినిమాలన్నీ దిల్ రాజు చుట్టూనే తిరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రెండు పెద్ద సినిమాల హీరోలు మంకుపట్టు పట్టారు. తమ సినిమాకే ఎక్కువ థియేటర్లు కావాలంటూ డిమాండ్ చేశారు. ముందు మేమే వస్తామంటూ వాదులాడుకున్నారు. దీంతో ఒకర్ని సమర్థించలేక, మరొకర్ని వ్యతిరేకించలేక నానా ఇబ్బందులు పడ్డారు దిల్ రాజు. ఈరోజు మీడియాతో పైకి నవ్వుతూ మాట్లాడినప్పటికీ, ఈ 4 రోజులు అతడు పడిన బాధ కళ్లల్లో కనిపిస్తూనే ఉంది.

అందుకేనేమో ఆఫ్ ది రికార్డు, రాజుకు క్లోజ్ గా ఉండే జర్నలిస్ట్ మిత్రులంతా అడగాల్సిన మాట అడిగేశారు. “రాజుగారు.. ఎన్నాళ్లిలా మింగలేక కక్కలేక ఉంటారు. ఏదో ఒకటి తేల్చేయొచ్చు కదా” అనేది జర్నలిస్ట్ మిత్రుల మాట. నిజమే కొన్ని సార్లు దిల్ రాజుకు కూడా అలానే అనిపిస్తుంటుంది. హీరోల ఇగోల మధ్య తన కోట్ల రూపాయల డబ్బును ఎందుకు ఫణంగా పెట్టాలనే కోపం, ఆవేదన దిల్ రాజుకు కూడా ఉంది.

కానీ బడా హీరోలతో వ్యవహారం. అందుకే మింగలేడు, కక్కలేడు.ప్రెస్ మీట్ లో అసలు కారణాలేంటనేది ఒక్క ముక్క కూడా బయటకు చెప్పలేకపోయాడు. కానీ ప్రెస్ మీట్ పూర్తయిన తర్వాత ఇదే టాపిక్ ను కొనసాగిస్తూ, ఇద్దరు ముగ్గురు మీడియా మిత్రులతో దిల్ రాజు చెప్పిన మాటలు మాత్రం ఆయన కోపాన్ని చెప్పకనే చెబుతున్నాయి. “మనకు కూడా ఓ రోజు వస్తుంది బ్రదర్.. ఎన్నాళ్లిలా సర్దుకుపోతాం” అనే మాట దిల్ రాజు నోట ఆఫ్ ది రికార్డు వచ్చింది.

నిజానికి దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఆయనిప్పుడు ప్రొడ్యూసర్ స్థాయి కంటే ఎక్కువ. కొంతమంది హీరోల్ని కమాండ్ చేసే స్థాయిలో కూడా ఉన్నాడతను. కానీ ఈసారి అలా కాదు. అక్కడున్నది ఓవైపు మహేష్ బాబు, మరోవైపు అల్లు అర్జున్. వీళ్ల ఇగోలకు ఈ 4 రోజులు ఓ రేంజ్ లో ఇబ్బంది పడ్డాడు దిల్ రాజు. శిరీష్ మాటల్లోనే చెప్పాలంటే టీ కప్పులో తుపాను లాంటి ఈ వివాదం, దిల్ రాజు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపించింది.

ఈ సారికి ఈ సమస్య సమసిపోయింది. ఇంకో సందర్భంలో ఇదే తరహా ఇగో సమస్య మళ్లీ తెరపైకి రాదని ఏంటి గ్యారెంటీ. ఇప్పుడు మహేష్-బన్నీ ఇగోలకు పోయారు. రేపు మహేష్-ఎన్టీఆర్ ఇగో క్లాష్ అయితే పరిస్థితేంటి? అప్పుడు కూడా దిల్ రాజు లాంటి మరో నిర్మాత ఇబ్బంది పడాల్సిందేనా. ప్రతిసారి ప్రొడ్యూసర్స్ గిల్డ్ చొరవ తీసుకొని సమస్యను పరిష్కరిస్తుందనే గ్యారెంటీ ఉందా? 

ఇకనైనా హీరోలు మారాలి. అప్పుడప్పుడు నిర్మాతలు చెప్పేది కూడా వినాలి. నిజంగా దిల్ రాజు రేపు ఉదయం బరస్ట్ అయి, మనసులో ఉన్నదంతా కక్కితే పరిస్థితేంటి? ఈ హీరోలు ఎలాంటి సంజాయిషీలు ఇచ్చుకోలేరు. అది పరిశ్రమకు కూడా మంచిది కాదు.