ప్రేమించడం లేదని, పెళ్లికి అంగీకరించడం లేదని అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. యాసిడ్ దాడి చేయడం, కత్తితో దాడి చేయడం లాంటి దురాగతాలు చాలానే చూశాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రివర్స్ దాడి. పెళ్లికి నిరాకరించాడని ప్రియుడి ఇల్లుని తగలబెట్టేసింది ఓ యువతి.
బీదర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. జిల్లాలోని సస్తాపూర్ అనే గ్రామంలో భీమరావు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. ఆ టైమ్ లో అతడికి సుమ అనే వ్యక్తి పరిచయమైంది. ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని భీమరావును బలవంతం చేయసాగింది సుమ. కానీ భీమరావు అందుకు అంగీకరించలేదు.
సుమ వేధింపులు ఎక్కువవ్వడంతో తన కుటుంబంతో పాటు మరో గ్రామానికి వెళ్లిపోయాడు భీమరావు. తనను వదిలేసి వెళ్లిపోయాడనే కోపంతో సుమ, అతడ్ని మరింత వేధించసాగింది. ఈ క్రమంలో మనుషుల్ని పెట్టి భీమరావు ఇంటిని తగలబెట్టింటింది. అతడు నడుపుతున్న ఆటోను సైతం తగలబెట్టించింది.
జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సుమ-భీమరావు మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. సుమ నుంచి 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు భీమరావు. అయితే సుమ మాత్రం డబ్బు కోసం దాడి చేయలేదని, కేవలం తనను నిరాకరించాడనే కోపంతోనే దాడి చేశానని పోలీసుల ముందు ఒప్పుకుంది.