బీజేపీ నేతల మాటలకు అర్థాలే వేరు. భయపెట్టడం, లొంగదీసుకోవడం…ఇది బీజేపీ సిద్ధాంతమని ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చేలా ఆ పార్టీ ముఖ్య నేతల మాటలున్నాయి. విజయవాడలో బీజేపీ నిర్వహించిన ‘ప్రజా ఆగ్రహ సభ’ లో జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బెదిరింపే, భయపెట్టే ధోరణిలో ఉన్నాయి.
రాష్ట్రంలో బెయిలుపై బయట ఉన్న నేతలు త్వరలో జైలుకు వెళ్తారని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్…మూడూ కుటుంబ పార్టీలే అన్నారు. ఈ పార్టీలు అవినీతికి పాల్పడతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజలు ఆశీర్వదిస్తే చిన్న పార్టీగా ఉన్న బీజేపీ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను త్వరలో జైలుకు పంపుతామని ప్రకాశ్ జవదేకర్ హెచ్చరించినట్టుగా ఉంది. అంటే ప్రత్యర్థులకు జైలు లేదా బెయిలు తమ చేతుల్లో ఉందని ప్రకాశ్ జవదేకర్ చెప్పదలుచుకున్నారా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇది న్యాయ వ్యవస్థను అవమానించడం కాదా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఎవరిని మెప్పించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారో చెప్పాలని ప్రకాశ్ జవదేకర్‌ను నెటిజన్లు నిలదీస్తున్నారు. బీజేపీలో టీడీపీ వలస నేతల మాటలు విని, మరోసారి భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటోందని, ఇక ఏపీలో ఎప్పటికీ ఆ పార్టీ బలోపేతం కాదనే అభిప్రాయాలు వెల్లువవెత్తుతున్నాయి. టీడీపీ ఎజెండాతో ముందుకెళుతున్న బీజేపీని ప్రజానీకం ఎందుకు ఆశీర్వదించాలో జవాబు చెప్పాలని ప్రకాశ్ జవదేకర్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.