ఒక‌వైపు క‌రోనా టెన్ష‌న్.. నేత‌ల‌కు ఎన్నిక‌ల టెన్ష‌న్!

ఒక‌వైపు అంత‌ర్జాతీయంగా భారీ స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. యూర‌ప్ లో ని వివిధ దేశాల్లో భారీ సంఖ్య‌లో క‌రోనా కేసులు వ‌స్తున్నాయి. వాటిల్లో వేగంగా వ్యాపిస్తుందంటున్న ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య కూడా…

ఒక‌వైపు అంత‌ర్జాతీయంగా భారీ స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. యూర‌ప్ లో ని వివిధ దేశాల్లో భారీ సంఖ్య‌లో క‌రోనా కేసులు వ‌స్తున్నాయి. వాటిల్లో వేగంగా వ్యాపిస్తుందంటున్న ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య కూడా భారీ స్థాయిలో ఉంద‌ని ఆయా దేశాలే చెబుతున్నాయి. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వంద‌ల సంఖ్య‌లోనే ఉన్నాయి. అన‌ధికారికంగా వీటి రేంజ్ ఏమిటో తెలియ‌దు.

ఇదే స‌మ‌యంలో దేశంలో వ‌స్తున్న మొత్తం క‌రోనా కేసుల సంఖ్య మాత్రం పూర్తి నియంత్ర‌ణ‌లోనే ఉంది. ఇంత పెద్ద దేశంలో ఇప్పుడు గ‌త వారం రోజుల్లో కూడా స‌గ‌టున రోజుకు ఏడు వేల స్థాయిలో మాత్ర‌మే కేసులు వ‌స్తున్నాయి. క‌రోనా విష‌యంలో ఇండియా చూపిన పీక్ స్టేజీతో పోలిస్తే.. ఇది ఊర‌టే. 

అయితే ఇదే ప‌రిస్థితి ఎన్ని రోజులు ఉంటుంద‌నేదే ఆందోళ‌న రేపుతున్న అంశం. ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి నేప‌థ్యంలో వివిధ రాష్ట్రాలు ఆంక్ష‌ల‌ను ప్ర‌క‌టించాయి. ప్ర‌క‌టిస్తున్నాయి. నైట్ క‌ర్ఫ్యూ. బార్ల‌, థియేట‌ర్ల‌ను యాభై శాతం కెపాసిటీతోనే న‌డ‌పాల‌న‌డం, మాస్కులు లేక‌పోతే ఫైన్లు.. వంటి చ‌ర్య‌లు మొద‌లుపెట్టాయి. క‌ర్ణాట‌క‌, ఢిల్లీ రాష్ట్రాలు అధికారికంగా ఆంక్ష‌ల‌ను అనౌన్స్ చేశాయి. ఇక మిగ‌తా రాష్ట్రాలు ఈ బాట ప‌ట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు.

ఈ సంగ‌త‌లా ఉంటే.. కొత్త వేరియెంట్ భ‌యాందోళ‌నల మ‌ధ్య నేత‌ల‌కు ఎన్నిక‌ల టెన్ష‌న్ కూడా ప‌ట్టుకుంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో యూపీతో స‌హా ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఈ ఎన్నిక‌లు రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ యూపీని తిరిగి నిల‌బెట్టుకోవాల‌నే కృత నిశ్చ‌యంతో ఉంది.

ఇప్ప‌టికే ఎన్నిక‌ల టార్గెట్ గా ర‌క‌ర‌కాల అస్త్రాల‌ను సంధిస్తున్నారు. యూపీలో మ‌హిళ‌ల ఖాతాల్లోకి ప్ర‌ధాన‌మంత్రి వెయ్యి కోట్ల రూపాయ‌ల‌ను జ‌మ చేశారు. మ‌రోవైపు వీర హిందుత్వ వాదులు ఘాటుగా మాట్లాడుతున్నారు. ఇదంతా యూపీ ఎన్నిక‌ల వేడి కోస‌మే అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.  

మ‌రి ఇప్ప‌టికే వీరు ప‌ని మొద‌లుపెట్టారు. ఇలాంట‌ప్పుడు ఎన్నిక‌లు వాయిదా ప‌డటానికి వారు స‌మ్మ‌తిస్తారా? అనేది అనుమాన‌మే! మ‌రి ఒక‌వైపేమో ఒమిక్రాన్ భ‌యాలు వెంటాడుతున్నాయి. మ‌రో నెల రోజుల త‌ర్వాత యూపీ ఎన్నిక‌ల షెడ్యూల్ వెళ్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. మ‌రి క‌రోనా ఆ స‌మ‌యానికి ఎలాంటి ప‌రిస్థితుల‌ను క‌ల్పిస్తుందో ఊహించేందుకు తేలిక‌గా లేదు.

ఇప్ప‌టికే ఆంక్ష‌లు మొద‌ల‌య్యాయి కొన్ని రాష్ట్రాల్లో. అయినా క‌రోనా భ‌యాల‌కు వెర‌వ‌క దేశంలోనే అత్యంత ఎక్కువ జ‌నాభా క‌లిగిన రాష్ట్రంలో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తారా? లేక క‌రోనా కొత్త ఆందోళ‌న‌లు స‌ద్దుమ‌ణిగే వ‌ర‌కూ ప్ర‌జారోగ్యానికే పెద్ద పీట వేస్తారా.. అనేది ప్ర‌స్తుతానికి ఇంకా స‌మాధానం లేన‌ట్టే!