అరెస్ట్ చేస్తారా, చేసుకోండి…దేనికైనా సిద్ధంః వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ ఎదుర్కొంటున్న వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి అన్నింటికి సిద్ధ‌మైన‌ట్టు తేల్చి చెప్పారు. ఏ క్ష‌ణాన్నైనా  జైలుకు వెళ్ల‌డానికి రెడీగా ఉన్న‌ట్టు ఆయ‌న మాట‌ల సారాంశం. క‌డ‌ప…

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ ఎదుర్కొంటున్న వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి అన్నింటికి సిద్ధ‌మైన‌ట్టు తేల్చి చెప్పారు. ఏ క్ష‌ణాన్నైనా  జైలుకు వెళ్ల‌డానికి రెడీగా ఉన్న‌ట్టు ఆయ‌న మాట‌ల సారాంశం. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రే భాస్క‌ర్‌రెడ్డి. వివేకా హ‌త్య కేసులో ఈయ‌న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇవాళ విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ నుంచి నోటీసులు అందుకున్నారు.

దీంతో ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు క‌డ‌ప సెంట్ర‌ల్ జైలుకు సంబంధించి సీబీఐ గెస్ట్ హౌస్‌కు వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి వెళ్లారు. అయితే సీబీఐ అధికారులు అక్క‌డ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న పులివెందుల‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ఈ సమ‌యంలో మీడియాతో ఆయ‌న మాట్లాడారు. విచారించ‌డానికి సీబీఐ అధికారులు లేర‌న్నారు. వివేకా కేసును ప‌క్క‌దారి ప‌ట్టించొద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 

త‌న‌ను అరెస్ట్ చేయాల‌ని అనుకుంటే చేసుకోవ‌చ్చ‌న్నారు. దేనికైనా సిద్ధ‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. వైఎస్ వివేకా లేఖ చూస్తే వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని భాస్క‌ర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. విచార‌ణ నిమిత్తం మ‌రోసారి నోటీసు ఇస్తే, వ‌చ్చి స‌హ‌క‌రిస్తాన‌ని భాస్క‌ర్‌రెడ్డి అన్నారు.

వివేకా రాసిన లేఖ‌ను బ‌య‌ట‌పెడితే హ‌త్య ఎవ‌రు చేశారో తెలుస్తుంద‌ని ఇటీవ‌ల క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా అన్నారు. ఇదే విష‌య‌మై సీబీఐని డిమాండ్ చేసిన‌ట్టు ఆయ‌న చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా వుండ‌గా వైఎస్ భాస్క‌ర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తార‌నే స‌మాచారంతో కడప సెంట్రల్ జైలు వ‌ద్ద‌కు పెద్ద ఎత్తున వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వెళ్లారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. సీబీఐ అధికారులు లేక‌పోవ‌డంతో వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి ఇంటికి వెనుదిరిగారు. ఆ త‌ర్వాత వైసీపీ కార్య‌క‌ర్త‌లు కూడా అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.