ఎన్నిక‌ల‌కు ముందే చేతులెత్తేసిన టీడీపీ!

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీ చేతులెత్తేసిందా? అంటే…ఔన‌ని అధికార పార్టీ వైసీపీ చెబుతోంది. మూడు ప‌ట్ట‌భ‌ద్ర, రెండు ఉపాధ్యాయ స్థానాల‌కు 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సామ‌గ్రితో అధికారులు…

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీ చేతులెత్తేసిందా? అంటే…ఔన‌ని అధికార పార్టీ వైసీపీ చెబుతోంది. మూడు ప‌ట్ట‌భ‌ద్ర, రెండు ఉపాధ్యాయ స్థానాల‌కు 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సామ‌గ్రితో అధికారులు త‌మ‌కు కేటాయించిన ప్రాంతాల‌కు బ‌య‌ల్దేరారు. తెల్ల‌వారితే ఎన్నిక‌లే. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌న మార్క్ రాజ‌కీయానికి తెర‌లేపడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బోగ‌స్ ఓట్లు, అక్ర‌మాల‌పై చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌కు ఆయన ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా బోగ‌స్ ఓట్ల వివ‌రాల‌ను ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి పంపారు. తిరుప‌తిలోనే బోగ‌స్ ఓట్లు ఎక్కువ‌ని ఆయ‌న ప్ర‌ధాన ఫిర్యాదు. మ‌రోవైపు ఏపీ ఎన్నిక‌ల అధికారులు వైసీపీతో కుమ్మ‌క్క‌య్యార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. చంద్ర‌బాబు ఫిర్యాదులో పేర్కొన్న బోగ‌స్ ఓట్లు వివ‌రాలు చూస్తే 100 ఓట్లకు మించి వుండే అవ‌కాశం లేదు.

బోగ‌స్‌, న‌కిలీ ఓట్ల‌ను ఓట‌ర్ల జాబితాలో చేర్చ‌డం వ‌ల్ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ అప‌హాస్యం అవుతోంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బోగస్, నకిలీ ఓట్లతో ప్రజాస్వామ్య విలువలకు, ప్రాథమిక హక్కులకు తీవ్ర నష్టం కలుగుతోంద‌న్నారు. అక్రమాలను అడ్డుకోవాలని, బోగస్ ఓట్ల నమోదుకు స‌హ‌క‌రించిన అధికారుల‌పై  క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిని ఆయ‌న కోర‌డం విశేషం.

క్షేత్ర‌స్థాయిలో ప్ర‌త్య‌ర్థితో ఢీకొని ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం చంద్ర‌బాబు మ‌రిచిపోయిన‌ట్టున్నారని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌ని గ్ర‌హించి, కొత్త నాట‌కానికి తెర‌లేపార‌ని అధికార పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఎంత‌సేపూ ప్ర‌చార పిచ్చితో ఫిర్యాదులు, ఆరోప‌ణ‌ల‌తోనే పుణ్యకాలం కాస్త చంద్ర‌బాబు గ‌డిపేస్తున్నార‌ని వారు మండిప‌డుతున్నారు. 

ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ లేక‌పోతే ఏ పార్టీ కూడా విజ‌యం సాధించ‌లేద‌ని సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబుకు తెలియ‌దా? అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం కంటే ఓట‌మిపై సాకులు వెతుక్కుంటున్నార‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.