‘మహా’కు సుద్దులు చెప్పిన హరీష్ శంకర్

కేజిఎఫ్ సినిమా మీద దర్శకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్ల ప్రకంపనలు ఇంకా సద్దు మణిగినట్లు లేదు. ఈ వివాదం పేరు ఎత్తకుండానే దర్శకుడు హరీష్ శంకర్ సున్నితంగా చిన్న క్లాస్ పీకారు.  Advertisement…

కేజిఎఫ్ సినిమా మీద దర్శకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్ల ప్రకంపనలు ఇంకా సద్దు మణిగినట్లు లేదు. ఈ వివాదం పేరు ఎత్తకుండానే దర్శకుడు హరీష్ శంకర్ సున్నితంగా చిన్న క్లాస్ పీకారు. 

బలగం సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ క్లాస్..మాస్..కమర్షియల్..ఆర్ట్..ఇలా రకరకాలుగా మనమే, అది కూడా ఈ చిన్న ఇండస్ట్రీలో కిందా మీదా అయిపోతామని, అసలు అంతకు మించిన సమస్యలు అనేకం వున్నాయని అన్నారు. అసలే థియేటర్ కు జనాలు రావడం లేదు. ఓటిటి అంటున్నారు. ఇంకా ఇంకా అనేక పెద్ద సమస్యలు వున్నాయని, వాటిని వదిలేసి క్లాసూ…మాసూ అంటూ అక్కరలేని వివాదాలెందుకు అన్నారు.

మంచి చిన్న సినిమా వస్తే దాన్ని భుజాల మీద వేసుకుని ప్రమోట్ చేసేది మాస్, కమర్షియల్ సినిమాలు తీసే పెద్ద డైరక్టర్ లే అన్న సంగతి మరిచిపోకూడదన్నారు. ఒకడు సైకిల్ మీద వెళ్తూ చల్లగాలిని ఆస్వాదిస్తాడని, మరొకడు కారులో వెళ్తూ ఏసి ఎంజాయ్ చేస్తాడని, ఎవరూ తక్కువా కాదు, ఎక్కువా కాదు అని అన్నారు. పెరుగు అన్నం ఆరోగ్యానికి మంచిది. కానీ బిరియానీ ఎక్కువ మంది తింటారు. అలా అని అందరూ బిరియానీ మానేసి పెరుగు అన్నం తినమని చెప్పడం సరి కాదన్నారు. కావాలంటే బిరియానీ తిన్నాక పెరుగు అన్నం కూడా తినమని చెప్పడం సబబుగా వుంటుందన్నారు.

మొత్తం మీద ఇటు వీళ్లను ఇబ్బంది పెట్టుకుండా, అటు వాళ్లని వెనకేసుకురాకుండా, సుతిమెత్తగా బానే క్లాస్ పీకారు హరీష్ శంకర్.