ఇండస్ట్రీ కళ్లు..చెవులు అటు తిరిగాయి

చమ్కీల అంగీవేసి అంటూ ఓ స్వరం కొత్తగా వినిపించింది దసరా సినిమా నుంచి. నిజానికి సినిమా సంగీత ప్రపంచానికి కొత్త గొంతు కాదు. తమిళంలో మంచి మంచి పాటలు ఈ సింగర్ ఖాతాలో వున్నాయి.…

చమ్కీల అంగీవేసి అంటూ ఓ స్వరం కొత్తగా వినిపించింది దసరా సినిమా నుంచి. నిజానికి సినిమా సంగీత ప్రపంచానికి కొత్త గొంతు కాదు. తమిళంలో మంచి మంచి పాటలు ఈ సింగర్ ఖాతాలో వున్నాయి. అవే సినిమాల డబ్బింగ్ పాటలు కూడా మన దగ్గర సక్సెస్ అయినవీ వున్నాయి. 

కానీ దసరా సినిమాలో ఒక్క పాటతో ఇప్పడు అవన్నీ మన జనాలకు గుర్తుకు వస్తున్నాయి. ‘కాటుక కనులే మురిసిపోయే పిలడా నిను చూసి’ అంటూ సూర్య సినిమాలో పాడిన పాట కానీ, మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకున్న ‘రౌడీ బేబీ’ పాట కానీ ఈ స్వరం నుంచి వచ్చిన భాస్వరాలే.

ఆమె పేరు ఢీ..పూర్తి పేరు..దీక్షిత. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కూతురు. పట్టుమని పాతికేళ్లు లేవు కానీ పదుల సంఖ్యలో పాటలు పాడేసింది. అసలు తన 14వ ఏట నుంచే పాడడం ప్రారంభించింది. రెహమాన్ తో కలిసి తొలి పాప్ ఆల్బమ్ చేసేసింది ఈ గాయని. ఇక ఆ తరువాత పాడిన ప్రతి పాట వైరల్ నే.

దసరా సినిమాకు తండ్రి సంతోష్ నారాయణ్ నే సంగీత దర్శకుడు. నాన్న డైరక్షన్ లో చాలా పాటలే పాడింది. ఇప్పుడు ఏకంగా కష్టమైన, క్లిష్టమైన తెలంగాణ యాస ను ఓ తమిళ అమ్మాయి అతి చులాగ్గా పాడేయడం కచ్చితంగా మెచ్చుకోదగ్గదే. 

కాసర్ల శ్యామ్ పక్కా తెలంగాణ మాండలీకంలో రాసిన పాట, రామ్ మిరియాల తో కలిసి ఆలపించింది. ఇప్పుడు ఆ పాట వైరల్ అవుతోంది. దీంతో మన నిర్మాతలు, సంగీత దర్శకులు ఇప్పుడు ఈమెతో పాటలు పాడించేయాలని అప్పుడే డిసైడ్ అయిపోతున్నారు.