కాంగ్రెస్ ప‌గ్గాలు..రెడ్డికా, బీసీకా?

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ను త‌ప్పుకోబోతున్న‌ట్టుగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో.. ఆ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో కొన్నాళ్లుగా చ‌ర్చ…

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ను త‌ప్పుకోబోతున్న‌ట్టుగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో.. ఆ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో కొన్నాళ్లుగా చ‌ర్చ న‌డుస్తూ ఉంది. హుజూర్ న‌గ‌ర్ బై పోల్ లో ఉత్త‌మ్ భార్య ఓడిపోవ‌డంతో.. ఆ ఫెయిల్యూర్ ఉత్త‌మ్ ఖాతాలోకి ప‌డింది. అప్పుడే ఆయ‌న రాజీనామా చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మ‌ళ్లీ త‌ను రాజీనామా చేస్తున్న‌ట్టుగా ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో టీపీసీసీకి కొత్త అధ్య‌క్షుడు ఎవ‌ర‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

ప్ర‌ధానంగా నాలుగైదు పేర్లే వినిపిస్తూ ఉన్నాయి ఈ విష‌యంలో. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబుల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో వెంక‌ట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు.. ఆ ప‌ద‌వి విష‌యంలో చాన్నాళ్లుగా ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు. వీరిద్ద‌రూ ఎంపీల హోదాలో ఉన్నారు. ఇక వీరికి ప్ర‌త్యామ్నాయంగా శ్రీధ‌ర్ బాబు పేరు వినిపిస్తూ ఉంది. అయితే వీరెవ‌రూ కాద‌ని.. బీసీకి ప‌గ్గాలు అప్ప‌గించాలని మ‌రికొంద‌రు డిమాండ్ చేస్తున్నారు. వీళ్లంతా వీహెచ్ పేరును ప్ర‌తిపాదిస్తారో ఏమో!

తెలంగాణ విష‌యంలో కాంగ్రెస్ రాజ‌కీయం దిక్కుతోచ‌ని స్థితిలోనే కొన‌సాగుతూ ఉంది. రాష్ట్ర విభ‌జ‌న పాపం కాంగ్రెస్ కు తెలంగాణ‌లో కూడా త‌గులుతూనే ఉంది. ఉమ్మ‌డి ఏపీలో రాయ‌ల‌సీమ ప్రాంత నేత‌లు.. అంద‌రినీ క‌లుపుకుని పార్టీని ముందు నిలిపారు. అయితే కేసీఆర్ ట్రాప్ లో పూర్తిగా ప‌డిపోయి.. రాష్ట్రాన్నే విభ‌జించిన కాంగ్రెస్ నేత‌ల‌కు, సోనియాకు ఇప్పుడు త‌మ పార్టీని ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.