బీసీ బాబు Vs కాపు బాబు.. కమ్మ బాబుని నమ్మేదెవరు?

పార్టీలకు, నాయకులకు కావాల్సింది ఓట్లు. వాటి కోసం ఏ కులాన్ని నెత్తిన పెట్టుకోమన్నాపెట్టుకుంటారు, ఎవరిని దూరం చేసుకోవాలన్నా చేసుకుంటారు. ఇలాంటి కుల రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు. జనాలు అర్థం చేసుకోలేనంతకాలం, వారికి అవగాహన…

పార్టీలకు, నాయకులకు కావాల్సింది ఓట్లు. వాటి కోసం ఏ కులాన్ని నెత్తిన పెట్టుకోమన్నాపెట్టుకుంటారు, ఎవరిని దూరం చేసుకోవాలన్నా చేసుకుంటారు. ఇలాంటి కుల రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు. జనాలు అర్థం చేసుకోలేనంతకాలం, వారికి అవగాహన లేనంత కాలం బాబు ఈ ఫార్ములాతోటే గట్టెక్కారు. కానీ 2019లో మాత్రం ఘోరంగా దెబ్బతిన్నారు.

టీడీపీకి బీసీలే వెన్నెముక అనుకున్నారు కానీ, వారంతా బాబుకి చుక్కలు చూపించారు. కాపు రిజర్వేషన్లకు మేం రెడీ అని చంద్రబాబు ప్రకటించడంతో బీసీలు దూరమయ్యారు. అదే సమయంలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని, బీసీ కోటాలో వారిని చేర్చడం రాజ్యాంగబద్ధం కాదని కుండబద్దలు కొట్టిన జగన్ బీసీలకు ఆరాధ్య దైవం అయ్యారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమికి బీసీ వ్యతిరేక ఓటు కూడా ప్రధాన కారణం అని చెబుతారు. కాపు రిజర్వేషన్ల విషయంలో గట్టిగా ఉన్న జగన్ బీసీలకు దగ్గరయ్యారు. అక్కడితో ఆగకుండా.. కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిచ్చి వైసీపీలో బీసీలకు సముచిత స్థానం కల్పించారు. ఇక బీసీలు వేరే పార్టీ వైపు చూడకుండా చేశారు జగన్.

బాబు ఏం చేయాలి..? ఏం చేస్తున్నారు..?

2019లో బీసీలంతా దూరమయ్యాక చంద్రబాబు దిగాలు పడ్డారు. అటు కాపు ఓట్లలో కూడా చీలిక రావడంతో చంద్రబాబు స్ట్రాటజీ ఘోరంగా ఫెయిలైనట్టు అర్థమైంది. అందుకే తాజాగా మరోసారి బీసీలను దగ్గరకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారట బాబు. జిల్లా స్థాయిలో పార్టీ పదవుల్లో బీసీ నేతలకు అవకాశాలివ్వబోతున్నారట. 

టీడీపీలో ఉన్న బీసీ నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరీ 'బీసీ బాబు' అనిపించుకోవాలనుకుంటున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కూడా బీసీలకే అప్పగించామని కూడా చెప్పుకుంటున్నారు. రెండేళ్లలో పూర్తిగా బీసీ మేకప్ వేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలనేది బాబు ప్లాన్.

జనసేనతో చిక్కొచ్చిందిగా..?

వచ్చే ఎన్నికలనాటికి బీజేపీ, టీడీపీ, జనసేన.. కూటమి ఏర్పాటవుతుందనేది బహిరంగ రహస్యం. కాపు పార్టీగా ముద్రపడిన జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఇక బీసీలకు న్యాయం చేసేదేముంటుంది. జనసేనకు త్యాగం చేయాల్సిన సీట్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగిదే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే చాలామంది బీసీలు టీడీపీకి దూరమయ్యారు. జనసేన పొత్తుతో మిగిలినవారు కూడా పక్కదారి చూస్తారనే భయం కూడా ఉంది.

దీంతో బీసీ జపం చేయాలా, కాపు జపం చేయాలా అనే సందిగ్ధంలో పడిపోయారు బాబు. ఇప్పటికే ఓ సారి తప్పు చేసి బీసీల దెబ్బ రుచి చూసిన బాబు మరోసారి అదే తప్పు రిపీట్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.