“అమరావతి రాజధానిగా ఉంచాలో వద్దో 151మంది ఎమ్మెల్యేలు చర్చించుకోండి” అంటూ కూల్ గా మాట్లాడి 24 గంటలైనా గడవకముందే పవన్ కల్యాణ్ ఈరోజు బాగా ఓవర్ యాక్షన్ చేశారు. అమరావతి ప్రాంతంలో రచ్చ చేశారు. రైతులకు సంఘీభావంగా పర్యటిస్తానంటూ ముందుకు కదిలిన జనసేనానిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపైనే చిందులు తొక్కారు.
సీఎం కాన్వాయ్ మందడం ప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉందని, అది వెళ్లిపోగానే ర్యాలీకి అనుమతిస్తామని పోలీసులు వివరంగా చెప్పినా కూడా పవన్ పెడచెవిన పెట్టారు. ముళ్ల కంచెల ముందే కాసేపు కూర్చున్నారు, ఆ తర్వాత ఊగిపోతూ పోలీసులపై శివాలెత్తారు. ముళ్ల కంచెను దాటుకుని ఇవతలి వైపుకి వచ్చి మందడం చేరుకున్నారు. అక్కడ రైతులతో మాట్లాడి నా మద్దతు మీకేనంటూ మరోసారి ఊగిపోయారు.
ఇకపై అమరావతి అనే నినాదాలు చేయొద్దని, జై ఆంధ్రా, జైజై ఆంధ్రా అంటూ నినాదాలు చేయండని కూడా పిలుపునిచ్చారు. ఒకరకంగా చంద్రబాబు ఇన్నిరోజులూ చేసిన యాక్షన్ ఒక ఎత్తు, ఈరోజు పవన్ కల్యాణ్ చేసిన ఓవర్ యాక్షన్ ఒక ఎత్తు అనిపించేలా సాగింది రాజధాని ప్రాంతంలో జనసేనాని పర్యటన. రైతుల్ని రెచ్చగొట్టాలనే ప్రధాన అజెండాతోనే పవన్ వచ్చినట్టు స్పష్టంగా కనిపించింది. పోలీసులు అడ్డుకోవడంతో పవన్ ఆగ్రహంతో రగిలిపోవడం చూసి జనసైనికులే ఆశ్చర్యపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
గతంలో పలు బహిరంగ సభల్లో పవన్ ఇలాగే ఊగిపోయినా, ఇంత ఆవేశం ఎప్పుడూ చూడలేదంటున్నారు జనసైనికులు. పోలీసులు అడ్డుకోవడంతో ఎక్కడ వెనక్కు తగ్గాల్సి వస్తుందోననుకున్న పవన్, ముళ్లకంచెలు దాటి సినిమా సీన్ క్రియేట్ చేశారు. తన సిగ్నేచర్ మార్కు స్టిల్స్ ఇస్తూ ఆ ప్రాంతంలో కలియదిరిగిన తర్వాత కానీ ఆయన ఇగో శాటిస్ ఫై అయినట్టు లేదు. నిన్నటివరకూ సింగపూర్ లో షూటింగ్ చేసివచ్చిన పవన్, ఈరోజు అమరావతిలో షూటింగ్ చేశారంటూ మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా చేయడానికి కూడా ఈ ఓవర్ యాక్షనే కారణం.