భ‌య‌పెడుతున్న మ‌ల‌యాళ సినిమాలు!

ఓటీటీల్లో వ‌ర‌స పెట్టి విజ‌య‌వంతం అవుతున్న మ‌ల‌యాళీ సినిమాలు ఇదే స‌మ‌యంలో క‌థ‌, క‌థ‌నాల్లో తీవ్ర‌మైన హింస‌తో డిస్ట్ర‌బ్ చేస్తూ ఉన్నాయి! ఒక‌వైపు నెట్ ఫ్లిక్స లో ఉన్న *ఇర‌ట్టా*  ను మామూలు ప్రేక్ష‌కులు…

ఓటీటీల్లో వ‌ర‌స పెట్టి విజ‌య‌వంతం అవుతున్న మ‌ల‌యాళీ సినిమాలు ఇదే స‌మ‌యంలో క‌థ‌, క‌థ‌నాల్లో తీవ్ర‌మైన హింస‌తో డిస్ట్ర‌బ్ చేస్తూ ఉన్నాయి! ఒక‌వైపు నెట్ ఫ్లిక్స లో ఉన్న *ఇర‌ట్టా*  ను మామూలు ప్రేక్ష‌కులు చూసి త‌ట్టుకోవ‌డం కొంత క‌ష్టమే! మ‌నిషిలోని ప‌శు ప్ర‌వృత్తి, డిస్ట్ర‌బ్డ్ చైల్డ్ తీరు, పోలీసుల వ్య‌వ‌హారం.. ఈ మూడు కోణాల్లో ఈ సినిమా భ‌య‌పెడుతుంది. 

మ‌నిషిలో ప‌శు ప్ర‌వృత్తి గురించి సినిమాల్లో చూప‌డం కొత్త కాదు. అయితే ఇర‌ట్టాలో జోజూ జార్జి చేసిన రెండు క్యారెక్టర్లూ ఒక ర‌కంగా ప‌శువుల్లానే ప్ర‌వ‌ర్తిస్తాయి! పైకి ఒక‌టి హీరో క్యారెక్ట‌ర్, రెండోది నెగిటివ్ క్యారెక్ట‌ర్ అనుకోవ‌చ్చు. అయితే హీరో క్యారెక్ట‌ర్ త‌న భార్య‌, కూతురుపై ఏ మాత్రం జాలీద‌య కూడా లేకుండా ప్ర‌వ‌ర్తించిన‌ట్టుగానే ఉంటుంది. ఇత‌డిని తప్పించుకుని భార్య ఎక్క‌డికో పారిపోతుంది! కూతురు యుక్త‌వ‌య‌సులోకి వ‌చ్చే వ‌ర‌కూ ఆమె ప్ర‌తిభ‌ను నిరూపించుకునేంత వ‌ర‌కూ ఇత‌డికి భార్యా, పిల్ల‌లు గుర్తుకు రారు!

ఇక రెండో క్యారెక్ట‌ర్ ను అచ్చంగా ప‌శుప్ర‌వృత్తితోనే డిజైన్ చేశారు. పైకి మంచిగానే క‌నిపిస్తూ మ‌ద్యం ప్ర‌భావంలో తీవ్ర‌మైన ఘాతుకాల‌కు వెనుకాడ‌ని పాత్ర ఇది. ఇక రెండు క్యారెక్ట‌ర్ల తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మ‌రింత దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తుంది. 

ఇలాంటి మ‌నుషులు ఉండ‌ర‌ని కాదు. నిత్యం వార్త‌ల్లో ఇలాంటి ఘాతుకాల నుంచి క‌థ‌నాలు ఎన్నో వ‌స్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని తెర‌పై చూస్తే మాత్రం డిస్ట్ర‌బెన్స్ త‌ప్ప‌దు. ఇలాంటి పాత్ర‌ను చేయ‌డానికి జోజు జార్జ్ చేసింది మాత్రం సాహ‌స‌మే! 

కథా, క‌థ‌నాల విష‌యంలో ఎక్క‌డా త‌డ‌బాటు లేకుండా ఒక రా స్టోరీని తెర‌కెక్కించారు. పాత్ర‌ల‌ను సాధార‌ణ భావోద్వేగాల మ‌ధ్య నుంచి చూసే ప్రేక్ష‌కులు డిస్ట్ర‌బ్ కావ‌డం ఖాయం.

ఇక ప్ర‌స్తుతం మరో మ‌ల‌యాళీ సినిమా కూడా ఓటీటీలో ఊపు మీద ఉంది. అదే మ‌మ్ముట్టీ న‌టించిన క్రిస్టోఫ‌ర్. దాదాపు నెల కింద‌ట థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా కూడా క్రైమ్ థ్రిల్ల‌ర్. ఇది కూడా అమ్మాయిల‌పై ఘాతుకాల గురించే! సినిమా ఆసాంతం ఇలాంటి ఘ‌ట‌న‌లు, క్రైమ్ అండ్ పనిష్మెంట్ క‌థ‌న‌మే సాగుతుంది. అత్యాచార ఘ‌ట‌న‌లను తెర‌పై చూపించిన వైనం క‌ల‌త‌ను క‌లిగిస్తుంది. 

సినిమాలో అన్ని సంఘ‌ట‌న‌ల‌ను చూపించ‌ద‌లుచుకున్న‌ప్పుడు ఆ వ‌యోలెన్స్ పార్ట్ ను త‌గ్గించాల్సింది ద‌ర్శ‌కుడు. డొమెస్టిక్ వ‌యెలెన్స్, భార‌తీయ స‌మాజంలో అమ్మాయిల‌పై జ‌రుగుతున్న ఘాతుకాలు.. క్రైమ్-ప‌నిష్మెంట్  గురించిన సినిమాలు ఇవి. అయితే వ‌యోలెన్స్ మాత్రం ఎక్కువ‌గా చూపించారు. డెన్సిటీని చూపించ‌డానికి దారుణమైన దృశ్యాల‌ను చూప‌న‌క్క‌ర్లేదేమో!