న‌న్ను అరెస్ట్ చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వండిః వైఎస్‌ అవినాష్‌

మాజీ మంత్రి దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్ర‌ధానంగా కుటుంబ స‌భ్యులే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి…

మాజీ మంత్రి దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్ర‌ధానంగా కుటుంబ స‌భ్యులే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇప్ప‌టికే రెండుసార్లు సీబీఐ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మ‌రోసారి సీబీఐ నుంచి 160 సీఆర్‌పీసీ కింద నోటీస్‌లు అందుకున్నారు. విచార‌ణ‌కు ఆయ‌న హాజ‌రు కావాల్సి వుంది.

ఈ నేప‌థ్యంలో వైఎస్ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. సీబీఐ త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వ‌డంతో పాటు మ‌రికొన్ని అంశాల‌పై ఆయ‌న హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం విశేషం. విచార‌ణ సంద‌ర్భంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాల‌ని అవినాష్‌రెడ్డి కోరారు. అలాగే న్యాయ‌వాది స‌మ‌క్షంలో త‌న‌ను విచారించాలంటూ ఆయ‌న న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  

హైద‌రాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాల‌యంలో శుక్ర‌వారం విచార‌ణ‌కు అవినాష్‌రెడ్డి హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయి. అంత‌కు ఒక రోజు ముందు ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించ‌డం విశేషం. ఈ నెల 12న అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి కూడా సీబీఐ విచార‌ణ ఎదుర్కోనున్నారు. తండ్రీకొడుకుల‌ను సీబీఐ విచారిస్తుండ‌డం ఉత్కంఠ రేపుతోంది.

ముఖ్యంగా అవినాష్‌రెడ్డిని మూడో ద‌ఫా విచారిస్తుండ‌డంతో సీబీఐ దూకుడు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా ఆదేశించాల‌ని అవినాష్‌రెడ్డి పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టు వెలువ‌రించే తీర్పు సర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.