ప్రేక్షకులకు అసలైన అవమానం ఇది కదా..!

మనోభావాలు దెబ్బతిన్నాయి అనే స్లోగన్ పాతది. ఇప్పుడు కొత్తది వచ్చి చేరింది. “ప్రేక్షకులకు అవమానం” అనేది కొత్త డిస్కషన్ పాయింట్. హీరో నాని దీన్ని తెరపైకి తీసుకొచ్చాడు. టికెట్ రేట్లు తగ్గించి ప్రేక్షకుల్ని అవమానించారనేది…

మనోభావాలు దెబ్బతిన్నాయి అనే స్లోగన్ పాతది. ఇప్పుడు కొత్తది వచ్చి చేరింది. “ప్రేక్షకులకు అవమానం” అనేది కొత్త డిస్కషన్ పాయింట్. హీరో నాని దీన్ని తెరపైకి తీసుకొచ్చాడు. టికెట్ రేట్లు తగ్గించి ప్రేక్షకుల్ని అవమానించారనేది ఈయన లాజిక్. దీన్ని ఆసరాగా చేసుకొని బొత్స నుంచి అనీల్ వరకు చాలామంది మంత్రులు 'అవమానం' అనే పదం చుట్టూ చాలా విమర్శలు చేశారు, నానికి కౌంటర్ ఇచ్చారు.

ఇంతకీ ప్రేక్షకుడికి అసలైన అవమానం ఏంటి.. అది ఎక్కడ జరుగుతోంది? ఇప్పుడీ అంశం చుట్టూ సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తోంది.

చెత్త సినిమా తీసి ప్రచారంతో ఊదరగొట్టి థియేటర్లకు రప్పించి బాధపెట్టడమే.. ప్రేక్షకుడికి అసలైన అవమానం అంటున్నారు చాలామంది నెటిజన్లు. భారీ అంచనాలతో వచ్చిన ప్రేక్షకులకు సుత్తి కొట్టి పంపించడం, పైగా దానికి వందల రూపాయలు టికెట్ రూపంలో గుంజడం, ఇంకా చెప్పాలంటే బెనిఫిట్ షోలు వేసి మరీ చెత్త సినిమాలు చూపించి హింసించడమే అసలైన అవమానంగా పేర్కొంటున్నారు. ఇదీ అసలు సిసలు అవమానం అంటే. ఆమాట కొస్తే.. దాదాపుగా ప్రతి హీరో పదులసార్లు తమ అభిమానుల్ని ఇలా అవమానించి ఉంటారు. టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకుడు ఇన్సల్ట్ ఫీల్ అవ్వడనే విషయాన్ని నాని గ్రహించాలి.

థియేటర్లలో రిలీజ్ చేసే పరిస్థితి ఉండి కూడా టక్ జగదీష్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడం ప్రేక్షకులను అవమానించినట్టు కాదా.. అని యాంటీ నాని ఫ్యాన్స్ అందుకున్నారు. ఇవన్నీ పక్కనపెడితే.. తక్కువ రేటు పెట్టి టికెట్ కొని థియేటర్లోకి వెళ్లే అభిమానుల్ని నాని అవమానించారు. “ఏంటయ్యా ఇది, ఆమాత్రం బాల్కనీ టికెట్లు కొనుక్కోలేరా” అంటూ పరోక్షంగా ప్రేక్షకుడ్ని హేళన చేసినట్టయింది.

ఏకంగా వారం రోజుల పాటు ఫ్లాట్ రేట్లు పెట్టి టికెట్ పై 250, 350 చొప్పున దోచుకుంటుంటే.. అది ప్రేక్షకులకు అవమానం కాదా.. అని ప్రశ్నిస్తున్నారు సగటు సినీ అభిమానులు. టికెట్ రేటు 200 రూపాయలు పెట్టి.. ఇంటర్వెల్ లో స్నాక్స్ కింద 1000 రూపాయలు కొల్లగొట్టడం ప్రేక్షకులకు అవమానం కాదా అని అడుగుతున్నారు.

ఇన్ని అవమానాలు దిగమింగి, 150 రూపాయలు టికెట్ కొని థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకుడు.. ఇంటర్వెల్ లో బాత్రూమ్ కి వెళ్లి కంపు భరించలేక ముక్కు మూసుకుంటే అది ఎవరికి అవమానం. కోట్ల రూపాయల రెమ్యునిరేషన్ తీసుకునే హీరోకా.. టికెట్ కొని మోసపోయిన ప్రేక్షకుడికా..? ఇలా సవాలక్ష ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అభిమానులు క్యూ లైన్లో నిలబడి చొక్కాలు చించుకోని, అర్థరాత్రి నుండి పడిగాపులు పడి, బ్యానర్లకు దండలేసి, టెంకాయలు కొట్టి, థియేటర్లో పేపర్లు చించి.. ఈలలు గోలలు వేసి.. సినిమాల్ని హిట్ చేస్తే.. చివరకు హీరో రెమ్యునరేషన్ పెంచుకోవడం సగటు ప్రేక్షకుడికి అవమానం కాదా.. బదులు చెప్పండి నానీ గారూ అంటూ సోషల్ మీడియా నేచురల్ స్టార్ ని ప్రశ్నిస్తోంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి తను నేచురల్ స్టార్ ని కాదని నాని ముందుగానే చెప్పేసుకున్నారు. దీనిపై కూడా కౌంటర్లు పడుతున్నాయి. 'అవమానం స్టార్' అనే ట్యాగ్ లైన్ ను ఆల్రెడీ సోషల్ మీడియా ఇచ్చేసింది.