‘టాలీవుడ్’కు బెదిరింపులు

చంద్రబాబు అరెస్టయ్యారు. చంద్రబాబు హయాంలో ఆయన వల్ల అంతో ఇంతో లబ్ది పొందిన కే. రాఘవేంద్రరావు మినహా మరెవరు స్పందించలేదు. చంద్రబాబుతో, తెలుగుదేశం పార్టీతో అత్యంత సాన్నిహిత్యం వున్న వారు, అంతో ఇంతో లబ్ది…

చంద్రబాబు అరెస్టయ్యారు. చంద్రబాబు హయాంలో ఆయన వల్ల అంతో ఇంతో లబ్ది పొందిన కే. రాఘవేంద్రరావు మినహా మరెవరు స్పందించలేదు. చంద్రబాబుతో, తెలుగుదేశం పార్టీతో అత్యంత సాన్నిహిత్యం వున్న వారు, అంతో ఇంతో లబ్ది పొంది వుంటారు అని అనుకున్నవారు కూడా స్పందించలేదు. ఇది కాస్త షాకింగ్ నే. 

అశ్వనీదత్, సురేష్ బాబు లాంటి సానుభూతి పరులు వున్నారు. సురేష్ బాబుకు విశాఖలో స్టూడియోకి స్థలం ఇచ్చింది చంద్రబాబునే. మురళీమోహన్‌కు వున్న బంధం తెలిసిందే. పార్టీ ఎంపీ కూడా చేసారు. రవిబాబుకు కూడా పార్టీతో అనుబంధం వుంది. బోయపాటి శ్రీను, రాజమౌళి లాంటి వారికి చంద్రబాబుతో సాన్నిహిత్యం వుంది. ఇంకా చాలా మందికి చంద్రబాబుతో, పార్టీతో నేరుగానో, పరోక్షంగానో సంబంధాలు వున్నాయి.

ఇలాంటి వాళ్లంతా కనీసం నోరు విప్పలేదు. ఇది తెలుగుదేశం జనాలకు, దాని అనుకూల మీడియాకు కాస్త బాధగానూ, ఆశ్చర్యంగానూ వుంది. ఇదంతా కేసీఆర్ ఇలాకాలో వుండడం వల్లనా? లేక జగన్ పాలన మరో ఆరేడు నెలలు వుండడం వల్లనా? 

మురళీమోహన్ వ్యాపారాలు ఆంధ్రలో వున్నాయి. అశ్వనీదత్ భారీ సినిమా ప్రాజెక్ట్ కె విడుదల కావాల్సి వుంది. సురేష్ బాబు చిరకాలంగా న్యూట్రల్‌గా వుంటూ వస్తున్నారు. మరోపక్క ఆయనకు జగన్‌కు స్టూడియో లావాదేవీలు వున్నాయి. ఇలా ఎవరి బాధలు, ఎవరి బంధాలు వారికి వున్నాయి.

ఇలాంటపుడు ఎలా స్పందిస్తారు. కానీ తెలుగుదేశం అనుకూల డిజిటల్ మీడియా మాత్రం ఇలా అయితే భవిష్యత్‌లో చంద్రబాబు వచ్చినా ఇక టాలీవుడ్ కు ఎలాంటి ప్రయోజనాలు అందవంటూ బెదిరిస్తున్నారు. 

భవిష్యత్ లో చంద్రబాబు వల్ల టాలీవుడ్ కు ప్రయోజనాలు వుంటాయా? లేదా టాలీవుడ్ వ్యక్తులకు ప్రయోజనం వుంటుందా? అన్నది సంగతి పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్, జగన్ లతో ఎలా వుంటుంది అన్నది చూడాలి.