ఎన్నడూ లేనంతగా ఇటీవల వినిపిస్తున్నపదం..కమ్మ కులం..కమ్మ కులం అనేదే. నిజానికి ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి కారణాల్లో అది కూడా ఒకటి. ఆ సంగతి మరుగునపెట్టి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అన్నది ఆనాటి నినాదం అయింది.
తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఆ వర్గం వుంటూ వస్తున్నా, ఇన్నాళ్లు ఇంత బాహాటంగా ఎక్కడా కమ్మ కులం పేరు ఇంతలా వినిపించడలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా, చంద్రబాబు పుణ్యమా అని కమ్మకులం పేరు భయంకరంగా వినిపిస్తోంది.
అమరావతి నుంచి రాజధాని తరలించడానికి జగన్ కు కమ్మ కులం మీద వున్న వ్యతిరేకతే కారణం అనేలా ప్రచారం ఊపందుకుంది. చంధ్రబాబు కూడా ఆ విదమైన ప్రకటనలు చేస్తున్నారు.
ఒక పక్క ఆయనే అంటున్నారు అమరావతి అందరిదీ. అన్ని కులాల వారు వుంటున్నారు అని. మళ్లీ ఆయనే అంటున్నారు. కమ్మవారి రాజధాని కనుక జగన్ మార్చేస్తున్నాడు అని. మళ్లీ ఆంధ్రజ్యోతి ఆర్కే అంటున్నారు విశాఖలో కూడా కమ్మవారి హవా వుందని. అసలు 'కమ్మ..కమ్మ..కమ్మ' అంటూ కులాన్ని తెరపైకి తెచ్చి, నానా యాగీ చేస్తున్నది ఎవరు? అసలు కమ్మ కులం అనే మాట మరే ఇతర పార్టీ నేతల నుంచి కానీ, రాజకీయ నాయకుల నుంచి కానీ వస్తోందా?
కేవలం ఆంధ్రజ్యోతి లాంటి మీడియా మాత్రమే, తరచు కమ్మ కులం..కమ్మకులం అనే మాట అందిస్తోంది.ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పట్టుకున్నారు. నిజానికి ఇలా చేయడం ద్వారా మీరే కమ్మకులానికి అన్యాయం చేస్తున్నారు.
రాజధాని సమస్య కేవలం కమ్మకులానిది అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తున్నది వీరే. మళ్లీ ఇది అందరి సమస్య కావాలని చూస్తున్నది,చేస్తున్నది వీరే. దీంతో జనం కూడా ఇది ఒక కులానిది అని పట్టించుకోకుండా పక్కన పెడుతున్నారు.
ఆ విధంగా కమ్మకులాన్ని ఒంటరి చేస్తున్నది ఆంధ్రజ్యోతి, చంద్రబాబే అనుకోవాలి. నిజానికి ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాల భూమి కమ్మవారి చేతుల్లోనే వుంది. కావాలంటే ఎంక్వయిరీ చేసుకోవచ్చు. లెక్కలు తేల్చుకోవచ్చు. ఇది వాస్తవం.
ఆ విషయం మరుగున పెట్టి, అమరావతి లేకపోతే కమ్మవారికి అన్యాయం జరిగిపోతుందని ప్రొజెక్టు చేయడం వింతగా వుంది. పైగా ఓ జాతి నిర్వీర్యం అయిపోతోంది. ఓ జాతి మౌనం వహిస్తోంది అంటూ ఏవేవే పెద్ద కబుర్లుచెబుతున్నారు.
అమరావతి అనేది లేకపోతే ఇక కమ్మ కులం అనేదే లేదన్నంతగా మాట్లాడడం చూస్తుంటే విడ్డూరంగా వుంది. అమరావతి వచ్చి అయిదేళ్లు అయింది. కానీ కమ్మకుల అభ్యున్నతి ఎన్నో ఏళ్లుగా వుంది. ఇప్పుడు దాన్ని అమరావతికి ముడి పెట్టడంతో, మిగిలిన కులాలకు ఇది పట్టకుండా పోయింది. ఇదేదో కమ్మవారికి రెడ్లకు మధ్య గొడవలా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
దీంతో రాష్ట్రంలోని మిగిలిన కులాలకు ఇది పట్టకుండా పోయింది.పైగా ఆ విధంగా కమ్మవారిని మిగిలిన కులాలకు దూరం చేస్తున్నట్లు అయింది. రాజకీయంగా కమ్మకులం వైకాపాకు దూరం అనే విదంగా ప్రొజెక్ట్ అవుతోంది. దీనివల్ల వైకాపాను అభిమానించే కులాలకు దూరం చేస్తున్నట్లు అవుతోంది.
ఇలా మొత్తం మీద రాజధాని సీన్లోకి కులాన్ని తీసుకురావడం ద్వారా కమ్మవారికి చంద్రబాబు, ఆర్కే అన్యాయం చేస్తున్నారని అనుకోవాల్సిందే.