మాతృభాష కోసం ఈ మేధావులు, సమాజ ఉద్ధారకులుగా చెప్పుకుంటున్న సోకాల్డ్ తెలుగు భాషాభిమానులు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో గళమెత్తుతున్నారా? గరళమెత్తుతున్నారా? అనే అనుమానాలు సామాన్యుల్లో తలెత్తుతున్నాయి.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో అందరిదీ ఒకటే నినాదం మాతృభాష తెలుగును కాపాడాలని. మూడు రోజుల పాటు విజయవాడలో తెలుగుదనం ఉట్టిపడేలా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. మహాసభల్లో ఆదివారం చివరి రోజు మాతృభాషను కాపాడుకుందాం. స్వాభిమానం చాటుకుందాం అనే నినాదంతో బోదనా విధానం రూపొందించాలని తీర్మానించారు. ఇలా మొత్తం 11 తీర్మానాలు మహాసభల్లో చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతూ నిర్ణయించిన సీఎం జగన్‌పై సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుకు ఇంత అన్యాయం చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని పలువురు వక్తలు ఆరోపించారు. అయితే అందరికీ ఒకటే ప్రశ్న.
‘ఇంతకూ మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారో చెప్పండి’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్‌కల్యాణ్ తదితర పెద్దలను, ప్రముఖులను పేరుపేరునా సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రజలు, నాయకులు ఆంగ్లమాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులను ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా ఆదివారం విజయవాడలో రాష్ట్రేతర ప్రతినిధుల సదస్సు నిర్వహించారు.ఈ సభలో తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు, తెలుగు జాతి, తెలుగు నేల కోసం ఏర్పడిన రాష్ట్రంలో ఇప్పుడు భాష ఉనికే ప్రశ్నార్థకమవుతుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం అని ఆక్రోశం వెళ్లగక్కారు. ఇటీవల ఒక చానల్లో తెలుగుపై డిబేట్‌లో చలసానిని కంచె ఐలయ్య ఇంతకూ మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారో చెప్పాలని నిలదీశారు. అంతేకాదు ఇలాంటి సోకాల్డ్ మేధావుల వల్లే అనర్థాలు జరుగుతున్నాయని ఐలయ్య మండిపడ్డారు. తన పిల్లలు, మనుమళ్లు ఏ మాధ్యమంలో చదివారో, చదివిస్తున్నారో చలసాని జవాబు మాత్రం చెప్పడం లేదు. వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడం మాత్రం మానలేదు.
అలాగే ఇదే మహాసభలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ భాష కోసం గళమెత్తే వారిని ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భాష గురించి మాట్లాడే వారికి కులం ఆపాదిస్తున్నారని. దేనికైనా వెనకడుగు వేయమని, పాలకులెవరైనా స్పందిస్తాం, పోరాడతామని పరాక్రాలు చేస్తున్న మేధావుల్లారా, తెలుగు భాషోద్ధరకుల్లారా మీరు గళమెత్తితే ఫర్వాలేదని, కానీ గరళాన్ని(విషం) ఎత్తుతున్నారని అణగారిన వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.