ఈ ‘ఆగస్టు’ పోరాటం..విశాఖకు అన్యాయం

1984 ఆగస్టు.తెలుగు ప్రజలకు గుర్తే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాదెండ్ల భాస్కరరావును గద్దె దింపడానికి జరిగిన రాజకీయ ఉద్యమం. అప్పట్లో యంగ్ స్టర్స్ చంద్రబాబు, వెంకయ్య నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు తదితరులు…

1984 ఆగస్టు.తెలుగు ప్రజలకు గుర్తే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాదెండ్ల భాస్కరరావును గద్దె దింపడానికి జరిగిన రాజకీయ ఉద్యమం. అప్పట్లో యంగ్ స్టర్స్ చంద్రబాబు, వెంకయ్య నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు తదితరులు క్యాంప్ రాజకీయాలు నడిపి, జనాలను ఏకం చేసి, రామోజీ రావు లాంటి వాళ్లు నేషనల్ మీడియాను హైదరాబాద్ కు తీసుకువచ్చి, వాళ్ల చేత వ్యాసాలు వండి వార్పించి, జనాల అలజడిని గోరంతలు కొండతలుగా నిత్యం మీడియాలో వండి వార్చి, ఆఖరికి నాదెండ్లను గద్దె దింపి, ఎన్టీఆర్ ను గద్దెనెక్కించేలా ఇందిరాగాంధీనే వప్పించారు.

అయితే నాదెండ్లది వెన్నుపోటు, అనైతికం అని జనం కూడా కొంత వరకు భావించారు కాబట్టి, ఇది సాధ్యమైంది 

ఇప్పుడు మళ్లీ పక్కా ఇదే తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వెంకయ్య నాయుడు మద్దతు వుంటే వుండొచ్చుకానీ, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోలేరు. రాజ్యాంగ బద్ద పదవిలో వున్నారు.చంద్రబాబు ప్రతిపక్షనేతగావున్నారు. మీడియా మద్దతు అలాగే వుంది. పైగా ఈనాడు కు జ్యోతి తోడై, ఆ మద్దతు డబుల్ అయింది. 

కానీ రెండు సమస్యలు. చంద్రబాబు దగ్గర ప్రజా ప్రతినిధులు లేరు. మూకుమ్మడి ప్రజా మద్దతు లేదు. పైగా ఇప్పుడు వాళ్లు టేకప్ చేసిన సమస్య కేవలం రెండు జిల్లాల సమస్య. ఇంకా కచ్చితంగా ఒక పర్టిక్యులర్ ఏరియా సమస్య. కొంత మంది భూ యజమానుల సమస్య. ఇప్పుడు ఈ సమస్యను యావత్ ఆంధ్ర ప్రదేశ్ సమస్య చేయాలన్న ప్రయత్నం ప్రారంభమైంది. దీన్ని భూతద్దంలో దేశం అంతటికీ చూపించాలన్న యత్నం మొదలైంది. దీన్ని ఆంధ్ర ప్రజల ప్రగతి నిరోధక సమస్యగా చూపించి, మేధావులను రంగంలోకి దింపి, నానా ప్రకటనలు, చేయించి, రెండు జిల్లాల్లో జరిగే హడావుడిని మీడియాలో గోరంతలు, కొండంతలుగా చూపించి, ఎలాగైనా విశాఖకు ఆ మాత్రం రాజధాని యోగం కూడా లేకుండా చేయడం. తెలుగునాట జరుగుతున్నది ఇదే.

విశాఖకు జరిగింది అన్యాయం కాదా

అయిదేళ్ల క్రితం అమరావతిని రాజధానిగా ప్రకటించిన నాడు, విశాఖ గురించి ఎవ్వరికీ గుర్తు లేదు. అన్ని విధాలా అర్హమైన విశాఖను విస్మరించి, అమరావతి పేరు చెప్పి, విజయవాడలోనే అన్నీ కేంద్రీకరించిన నాడు ఈ మీడియాకు అస్సలు పట్టలేదు. పేరుకే అమరావతి రాజధాని. కానీ అన్నీ ఎక్కడ కొలువు తీరాయి? విజయవాడలో కాదా? అంతెందుకు గుంతకల్లు నుంచి విశాఖ వరకు అన్నీ కలిపి,విజయవాడ రైల్వేజోన్ చేయాలన్న ప్రయత్నం తెరవెనుక సాగించలేదా? ఎయిమ్స్ కూడా మంగళగిరికే ఇచ్చేయలేదా? 

ఇలా రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కటీ కృష్ణ, గుంటూరు జిల్లాల్లోకి తోసేసినపుడు, అయ్యో విశాఖ, అయ్యో ఉత్తరాంధ్ర, అయ్యో ఉత్తరాంధ్ర ప్రజలు అని ఒక్క మీడియా రాసిందా? మేధావులు పెదవి విప్పారా? అప్పుడు ఈ సోకాల్డ్ మీడియా మేధావులు తానులకు తానుల వ్యాసాలు వండి వార్చారా? లేదు కదా? మరి ఇప్పుడెందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? 

తెరవెనుక సన్నాహాలు

ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని ఆగస్టు సంక్షోభం మాదిరిగా డీల్ చేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఉద్యమాన్ని బలంగా ముందుకు నడపించడం కోసం తెరవెనుక భారీగా ఆర్థికబల సమీకరణ, వ్యూహ రచనలు జరుగుతున్నట్లు బోగట్టా. బలంగా నిధులు సమకూర్చి, బలమైన న్యాయ నిపుణులను నియమించి, కోర్టుల ద్వారా ఈ పయత్నాలకు బ్రేక్ వేయాలన్న ప్రయత్నం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాను కూడ గట్టే బాధ్యతను బాబు అనుకూల మీడియా తీసుకుంది. 

భాజపా న్యూట్రల్

ఇక్కడ ఇంకో సమస్య ఏమిటంటే వెంకయ్య నాయుడు వ్యతిరేక వర్గం కూడా భాజపాలో బలంగానే వుంది. ఈ వర్గం ఇప్పుడు భాజపాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ వర్గం అమరావతి విషయంలో న్యూట్రల్ గా వుండాలని భావిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ ను తేదేపా వర్గం దగ్గరకు తీయగలిగింది. కన్నా ఒపీనియన్ నే భాజపా ఒపీనియన్ గా చూపించే ప్రయత్నం చేస్తోంది. మోడీ శంకుస్థాపన అంటూ సెంటిమెంట్ అంటించే ప్రయత్నం చేస్తోంది. కానీ గతంలో ఇదే తెలుగుదేశం మోడీని చెంబుడు నీళ్లు, ముంతడు మట్టి అంటూ తెగ ఎద్దేవా చేసిన సంగతిని మరుగునపెడుతున్నారు. భాజపాలోని ఓ వర్గం ఈ విషయం గుర్తుంచుకుని, ఇప్పుడు న్యూట్రల్ గా వుంటోంది.

జగన్ వ్యూహం

అందుకే జగన్ కూడా అన్ని విధాలా పక్కాగా వుండేలాగే చూస్తూ , నిర్ణయాలు కోర్టులో వీగిపోకుండా వుండేలా చూసే ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సైలంట్ గా వుంటూ, హడావుడి నిర్ణయం కాకుండా, పలు కమిటీలు, నివేదికలు, క్యాబినెట్ నిర్ణయం అసెంబ్లీ తీర్మానం, ఇలా దశలవారీగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.  ఆ విధంగా లీగల్ గా సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు.

మొత్తం మీద అమరావతి వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా వీలయనంత పెంచాలని చూస్తోంది. కానీ అది ఫలిస్తుందా అన్నదే అనుమానంగా వుంది.

ఆర్వీ