పౌరసత్వ చట్టం సవరణలను వ్యతిరేకిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విషయంలో యూపీ సర్కారు చాలా కఠినంగానే వ్యవహరించింది. ఆమెను ఆందోళన కారులతో కలవనీయకుండా చూసేందుకు యూపీ పోలీసులు చాలా శ్రమించారు. ఒక దశలో ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. వారు తనపై దాడికి పాల్పడ్డారని, తోసేశారని ప్రియాంక ఆరోపించింది.
ఆ సంగతలా ఉంటే.. ప్రియాంక విషయంలో యూపీ పోలీసులు మరో రకమైన చర్యలకు కూడా వెనుకాడలేదు. ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత ఒకరికి ఆరు వేల వంద రూపాయల ఫైన్ విధించారు యూపీ పోలీసులు. ప్రియాంకను వెనుక కూర్చోబెట్టుకుని వెళ్లిన ధీరజ్ గుజ్జర్ కు ఈ ఫైన్ పడింది. అతడు బైక్ నడపడం లో వివిధ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్టుగా పోలీసులు పేర్కొన్నారు.
హెల్మెట్స్ లేకుండా బైకులో వెళ్లడం, ఈ విషయంలో ప్రియాంక- ధీరజ్ ఇద్దరికీ ఫైన్. అలాగే అతడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు తేల్చారు. ఆపై ర్యాష్ డ్రైవింగ్ కూడా చేశాడని అంటున్నారు. వీటన్నింటికీ గానూ 6,100 రూపాయల ఫైన్ విధించారట పోలీసులు.
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందళనల్లో పాల్గొని జైలు పాలైన ఎస్ఆర్ ధరపురి అనే మాజీ ఐపీఎస్ ను కలవడానికి ప్రియాంక తన కారులో బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో పోలీసులు ఆమె కారును ఆపేశారు. కారు దిగి ప్రియాంక కాంగ్రెస్ నేత బైక్ లో వెళ్లారు. ఆ బైక్ ప్రయాణం విషయంలోనే ఈ ఫైన్లు పడ్డాయి.