తండ్రి సీఎం, త‌న‌యుడు మంత్రి?

మ‌రి కాసేప‌ట్లో మ‌హారాష్ట్ర కేబినెట్ కొలువు దీర‌నుంది. ముఖ్య‌మంత్రిగా ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌మాణ స్వీకారం చేసి నెల రోజులు గ‌డిచిపోతున్నాయి. అయితే కేబినెట్ ఏర్పాటు మాత్రం ఇన్నాళ్లూ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. మంత్రి ప‌ద‌వుల…

మ‌రి కాసేప‌ట్లో మ‌హారాష్ట్ర కేబినెట్ కొలువు దీర‌నుంది. ముఖ్య‌మంత్రిగా ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌మాణ స్వీకారం చేసి నెల రోజులు గ‌డిచిపోతున్నాయి. అయితే కేబినెట్ ఏర్పాటు మాత్రం ఇన్నాళ్లూ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. మంత్రి ప‌ద‌వుల విష‌యంలో మూడు పార్టీల మ‌ధ్య‌న డీల్ కుద‌ర‌క‌పోవ‌డంతో కేబినెట్ ఏర్పాటు కాలేదు. 

అయితే ఈ కూట‌మి చివ‌ర‌కు పంప‌కాల విష‌యంలో క్లారిటీకి వ‌చ్చింది. ఎవ‌రికి ఎన్ని ప‌ద‌వులు, ఎవ‌రికి ఏయే ప్రాధాన్య‌త ఉన్న పద‌వుల గురించి చ‌ర్చించి ఒక అభిప్రాయానికి వ‌చ్చాయ‌ట మూడు పార్టీలు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు కొత్త కేబినెట్ కొలువు దీర‌నుంది.

ఇందులో ప్ర‌ధాన మైన హైలెట్స్ రెండు ఉండ‌బోతున్నాయ‌ని అంచ‌నా. ఒక‌టి అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి, రెండు ఆదిత్య ఠాక్రేకు మంత్రి ప‌ద‌వి.  నెల రోజుల కింద‌ట అజిత్ ప‌వార్ తిరుగుబాటు సంగ‌తి తెలిసిందే. ఆయ‌న బీజేపీతో చేతులు క‌లిపి డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే.. వెంట‌నే ఆ ప్ర‌భుత్వం కూలిపోయింది. బ‌ల‌ప‌రీక్ష‌లో నిల‌వ‌లేక‌పోయింది. అజిత్ ప‌వార్ తిరిగి ఎన్సీపీ గూటికి చేరిపోయారు. ఇప్పుడు ఆయ‌న‌కు మ‌ళ్లీ డిప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్క‌బోతూ ఉంద‌ని స‌మాచారం.

ఇక ముఖ్య‌మంత్రి కావాల‌నుకున్న ఆదిత్య ఠాక్రే మంత్రి కాబోతున్నార‌ట‌. సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే త‌న త‌న‌యుడిని మంత్రి వ‌ర్గంలోకి తీసుకోబోతున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆదిత్య‌ ఠాక్రే ఎమ్మెల్యేగా నెగ్గిన సంగ‌తి తెలిసిందే. కూట‌మి ప్ర‌భుత్వం లో సీఎం కావాల‌ని అత‌డు కోరుకుంటున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ ఛాన్స్ ఆయ‌న తండ్రికి ద‌క్కింది.