అప్పుడు బుక్కులేశారుగా క‌మ్యూనిస్టులూ!

తెలుగుదేశం అధినేత‌, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు అవినీతి గురించి ఏపీలో ముందుగా స్పందించింది క‌మ్యూనిస్టులే! కాంగ్రెస్ పార్టీ క‌న్నా ముందు.. చంద్ర‌బాబు అవినీతి గురించి పెద్ద ఎత్తున మాట్లాడింది, ఆయ‌న బాగోతాల గురించి…

తెలుగుదేశం అధినేత‌, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు అవినీతి గురించి ఏపీలో ముందుగా స్పందించింది క‌మ్యూనిస్టులే! కాంగ్రెస్ పార్టీ క‌న్నా ముందు.. చంద్ర‌బాబు అవినీతి గురించి పెద్ద ఎత్తున మాట్లాడింది, ఆయ‌న బాగోతాల గురించి బుక్కులేంది క‌మ్యూనిస్టులే! 1999 నాటికే బాబు జ‌మానా అవినీతి ఖ‌జానా అంటూ బుక్కులేశారు క‌మ్యూనిస్టు పార్టీల వాళ్లు!

అప్ప‌ట్లో ఆ బుక్కుల‌ను ఊరూరా ఉచితంగా పంచిన చ‌రిత్ర క‌మ్యూనిస్టు పార్టీల‌కు ఉంది. అప్ప‌ట్లో ఎర్ర‌న్న‌ల లెక్క ప్ర‌కారం.. చంద్ర‌బాబు అవినీతి విలువు అక్ష‌రాలా రెండు వేల కోట్లు! దాదాపు 25 యేళ్ల కింద‌ట ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీలూ చంద్ర‌బాబు నాయుడు ఏకంగా రెండు వేల కోట్ల రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డ్డాడు అంటూ బుక్కులు ఊరూరా పంచారు!

ఆ త‌ర్వాత కూడా చంద్ర‌బాబు అవినీతిపై క‌మ్యూనిస్టుల దాడి కొన‌సాగింది. ఈ దాడితోనే 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పట్టుకుని ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీలూ ఏపీలో గ‌ణ‌నీయంగా సీట్ల‌ను గెలిచాయి! చంద్ర‌బాబుపై ప్ర‌బ‌లిన వ్య‌తిరేక‌త‌, ఆ స‌మ‌యంలో క‌మ్యూనిస్టులు చేసిన పోరాటం, బ‌షీర్ బాగ్ కాల్పుల సంఘ‌ట‌న‌.. ఇవ‌న్నీ క‌మ్యూనిస్టు పార్టీల‌కు రాజ‌కీయంగా బ‌లాన్ని ఇచ్చాయి. 2004 ఎన్నిక‌ల్లో ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీలూ ఏపీ అసెంబ్లీలో గ‌ట్టి ప్రాతినిధ్యం పొందాయి.

అయితే.. ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌లోపే చంద్ర‌బాబుకు దోస్తుల‌య్యాయి రెండు క‌మ్యూనిస్టు పార్టీలు! తాము ప్ర‌చురించిన బుక్కులు గ‌ట్రా చెత్త‌కుప్ప‌లో ప‌డేసి 2009లో చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకుని మ‌హాకూట‌మి అంటూ క‌మ్యూనిస్టు పార్టీలు బ‌రిలోకి దిగాయి. అక్క‌డితో ఏపీలో ఆ పార్టీల చాప్ట‌ర్ దాదాపు క్లోజ్ అయ్యింది.

చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకుని బాగుప‌డ్డ పార్టీలు లేవ‌నే విష‌యాన్ని గ్ర‌హించ‌లేని క‌మ్యూనిస్టులు త‌మ‌కు అల‌వాటైన చారిత్ర‌క త‌ప్పిదానికి పాల్ప‌డి చిత్త‌య్యాయి. అప్పుడు ప‌డ్డాకా.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో క‌మ్యూనిస్టుల‌కు కాస్త చోటు కూడా ద‌క్క‌లేదు!

మ‌రి ఇప్పుడు అవినీతి కేసులో అరెస్టైన చంద్ర‌బాబు ప‌ట్ల క‌మ్యూనిస్టులు ఉదార‌మైన సానుభూతిని వ్య‌క్తం చేస్తూ ఉన్న వైనాన్ని చూస్తుంటే.. నారాయ‌ణ‌, రాఘ‌వులు వంటి వారు కారుస్తున్న క‌న్నీటిని గ‌మ‌నిస్తే.. బాబు జ‌మానా అవినీతి ఖ‌జానా అనే అప్ప‌టి సంచ‌ల‌న టైటిల్ గుర్తు వ‌స్తుంది!