సాయంత్రం అయితే చాలు చాలా సినిమా ఆఫీసులు సందడిగా వుంటాయి. పగలల్లా సినిమా పనులు అయిపోతాయి. రాత్రి వేళనే సరదాలు, సందళ్లు వుంటాయి. దర్శకుడు వివి వినాయక్ ఆఫీసు వేరు. ఆయనకు బోలెడు సర్కిల్. అంతా అక్కడికే చేరతారు. కబుర్లు, బాతాఖానీలు. హడావుడి.
అయితే నిన్న రాత్రో,మొన్న రాత్రో ఈ హడావుడి మధ్య ఓ వాదన, గొడవ జరిగినట్లు గ్యాసిప్ వినిపిస్తోంది. నిర్మాత సి కళ్యాణ్ దగ్గర వుండే వత్స నాగరాజుకు, మరో నిర్మాత నల్లమలుపు బుజ్జికి గట్టి వాదన జరిగి, సవాళ్లు, ప్రతి సవాళ్లు, వాదనలు, ప్రతి వాదనలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇద్దరికి మధ్య ఎలాంటి లావాదేవీలు లేవని, కానీ ఎందుకో మాటా మాటా వచ్చి గట్టిగా గొడవపడ్డారని బోగట్టా. ఒక దశలో నల్లమలపు బుజ్జి తనకు వైకాపా నేతలు తెలుసు అని, తను పిలిస్తే జగన్ కూడా వస్తాడని అన్నట్లు వినిపిస్తోంది.
ఇదంతా అక్కడే వున్న వివి వినాయక్ గమనించి, చికాకు పడి, ఇలా అయితే రేపటి నుంచి తన ఆఫీసుకు రావద్దని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు బోగట్టా. ఏ లావాదేవీ లేకుండా ఎందుకు గొడవపడ్డారన్నది ఎంక్వయిరీ చేస్తే,గొడవ పడ్డ మాట వాస్తవమే కానీ, ఎందుకో ఏమిటో తమకీ తెలియదని వినాయక్ సన్నిహిత వర్గాలు సమాధానం ఇచ్చాయి.