ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదవులను వ్యతిరేకిస్తున్న మేధావులను.. ప్రభుత్వ ముఖ్యులు ఒకే ఒక ప్రశ్న అడిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది, పేద పిల్లలు మాత్రమే, మధ్య తరగతి వారు కూడా తమ తాహతుకు మించి ఫీజులు కడుతూ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు, అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎలా తప్పు అవుతుంది? ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న మీరు, మీ పిల్లలను ఏ మీడియంలో చదివించారు? అని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు మేధావులు సమాధానం చెప్పలేదు. ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకించిన వారిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, పవన్ కల్యాణ్, వెంకయ్య నాయుడు.. తదితరులు ఉన్నారు. ఈ విషయంలో తను కూడా వార్తల్లో ఉండాలన్నట్టుగా కమ్యూనిస్టు నారాయణ అలియస్ చికెన్ నారాయణ కూడా చేరారు.
ఇటీవలే ఏపీలో పర్యటించి.. మళ్లీ తెలుగు గొప్పదనాన్ని గురించి తెలుగు వారికి వివరించి వెళ్లారు ఉప రాష్ట్రపతి వెంకయ్య. అయితే ఆయన తన పిల్లలను, వారి పిల్లలను ఏ మీడియంలో చదివించింది మాత్రం చెప్పలేదు. ఇక తన పిల్లలకు చైనీస్, జపనీస్ నేర్పుతున్నట్టుగా నారా లోకేష్ ఆ మధ్య చెప్పారు. ఇంగ్లిష్ మీడియంలో కొడుకును చదివిస్తూ, తెలుగు మీడియం పాఠశాలల గురించి లోకేష్ పోరాటం సంగతి అది.
ఇక ఈ విషయంపై నారాయణ కూడా స్పందించారు. ఆయనేమంటారంటే.. తెలుగు మీడియం బోధన గురించి పోరాడుతున్న తమ బోటి వారిని.. అసలు ప్రశ్నించకూడదట. తమ పిల్లలను ఏ మీడియంలో చదివించారనేది ప్రశ్నే కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇంగ్లిష్ మీడియం వద్దని ఈ ఎర్రన్న తేల్చారు! తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తాం అన్నట్టుగా, పేద పిల్లలు మాత్రమే తెలుగు మీడియంలో చదివి భాషను ఉద్ధరించాలని.. ఈ చికెన్ నారాయణ తేల్చి చెప్పారు! భలే కమ్యూనిజం ఇది!