జ‌ర్న‌లిస్టుల‌పై దాడి….ఆంధ్ర‌జ్యోతిలో సిగ్గుమాలిన రాత‌లు

క‌నీసం సాటి జ‌ర్న‌లిస్టుల‌పై దాడి జ‌రిగిన వార్త‌నైనా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా రాసే సంప్ర‌దాయం కొర‌వ‌డ‌డం అత్యంత విషాదం. రాజ‌ధానికి మ‌ద్ద‌తుగా ఉద్ధండ‌రాయునిపాలెంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ శుక్ర‌వారం మౌన‌దీక్ష చేప‌ట్టిన విష‌యం…

క‌నీసం సాటి జ‌ర్న‌లిస్టుల‌పై దాడి జ‌రిగిన వార్త‌నైనా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా రాసే సంప్ర‌దాయం కొర‌వ‌డ‌డం అత్యంత విషాదం. రాజ‌ధానికి మ‌ద్ద‌తుగా ఉద్ధండ‌రాయునిపాలెంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ శుక్ర‌వారం మౌన‌దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా టీవీ9 మ‌హిళా జ‌ర్న‌లిస్టు రాజ‌ధాని రైతుల‌ను ఇంట‌ర్వ్యూ చేసే క్ర‌మంలో పెయిడ్ ఆర్టిస్టుల‌ని వ‌చ్చే విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ కోరారు. దీంతో కోపోద్రిక్తులైన కొంత మంది ఆమెపై దాడికి పాల్ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో అడ్డుకున్న మ‌రో ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టుల‌పై క‌ట్టెల‌తో దాడికి పాల్ప‌డ్డారు. వారి కారును ధ్వంసం చేశారు. ఇది అక్క‌డ ఘ‌ట‌న‌కు సంబంధించిన వాస్త‌వం.

ఈ ఘ‌ట‌న‌పై ఈనాడులో జ‌ర్న‌లిస్టుపై దాడి అని వార్త ఇచ్చింది. అంతేకాకుండా ఈ దాడిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టు ఫెడ‌రేష‌న్ (ఏపీడ‌బ్ల్యూజేఎఫ్‌) ఖండించిన స‌మాచారం కూడా ఈనాడులో రాశారు. రాజ‌ధాని రైతుల ప‌క్షాన నిలిచిన ఈనాడు కూడా దాడికి సంబంధించిన వార్త‌ను య‌ధాత‌ధంగా ఇచ్చి శ‌భాష్ అనిపించుకొంది.

ఇక సాక్షి విష‌యానికి వ‌స్తే…ఎటూ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక కార్య‌క్ర‌మం. ఆ కార్య‌క్ర‌మంలో జ‌ర్న‌లిస్టుల‌పై దాడికి సాక్షిలో ప్రాధాన్యం ఇచ్చారు. మొద‌టి పేజీలో ఇండికేష‌న్‌తో పాటు లోప‌లి పేజీలో మూడు వార్త‌ల‌ను ఇచ్చారు.

అమ‌రావ‌తిలో ఉద్రిక్త‌త శీర్షిక‌తో ఇచ్చిన వార్త‌లో విలేక‌రుల‌పై దాడిని వివ‌రించారు. అలాగే ఆ వార్త‌తో పాటు  రాజ‌ధానిలో… హింస‌కు కుట్ర అని ఒక‌టి, దాడుల వెనుక టీడీపీ? అని మ‌రో వార్త‌ను క‌వ‌ర్ చేశారు. ఈ దాడిని ఏపీడ‌బ్ల్యూజేఎఫ్‌, ఏపీయూడ‌బ్ల్యూజే నాయ‌కులు ఖండించిన‌ట్టు పేర్కొన్నారు.

ఇక ఆంధ్ర‌జ్యోతి విష‌యానికి వ‌స్తే మీరు పెయిడ్ ఆర్టిస్టులా? అనే శీర్షిక‌తో వార్త ఇచ్చారు. ఈ వార్త‌లో  ‘మేం పెయిడ్‌ ఆర్టిస్టులమా..? మా త్యాగాలు అంత అలుసా’ అంటూ రాజధాని రైతులు ముగ్గురు మీడియా ప్రతినిధులపై రెండుచోట్ల దాడి చేశారంటూ క‌థ‌నాన్ని సాగించారు.  ఈ ఘటనల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయ‌ని, రైతులను ఆపే ప్రయత్నంలో పోలీసులూ గాయపడ్డారని వివ‌రించారు.

 ఓ చానల్‌ మహిళా రిపోర్టర్‌.. ఆ రైతుల దగ్గరకు వచ్చి ‘మీరు పెయిడ్‌ ఆర్టిస్టులా’ అన్నార‌ని, దీంతో రైతులు ఆవేశంతో ఆమెపై దాడికి ప్రయత్నించారని రాశారు. మహిళా రిపోర్టర్‌ కారును వెలగపూడిలో మహిళలు అడ్డుకుని కారు అద్దాలు పగలగొట్టారని పేర్కొన్నారు. పోలీసులు అతికష్టం మీద ఆమెను అక్కడి నుంచి పంపి వేశారని రాశారు.

క‌నీసం మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై దాడిని ఖండించిన వార్త‌కు ఆంధ్రజ్యోతి ఏ మాత్రం స్థానం క‌ల్పించ‌లేదు. తెల్ల‌వారి న‌ప్ప‌టి నుంచి స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం, హ‌క్కులు అంటూ రాద్ధాంతాలు చేసే, సిద్ధాంతాలు వ‌ల్లెవేసే ఆంధ్ర‌జ్యోతి సంపాద‌కులు, య‌జ‌మానుల వారికి మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై దాడి చేయ‌డం అంత ఆనందాన్ని ఇచ్చిందా? ఇదెక్క‌డి జ‌ర్న‌లిజం.

సొంత రంగానికి చెందిన వారిపై దాడి జ‌రిగినా ఇవ్వ‌లేని సంకుచిత మ‌న‌స్త‌త్వంతో ఆంధ్ర‌జ్యోతి ఉందా? అంతేకాకుండా బాధితుల‌ను అవ‌మానించేలా హెడ్డింగ్‌లు పెట్ట‌డం ఏం నీతి? ఇవేం సిగ్గుమాలిన రాత‌లో అర్థం కావడం లేదు.