యూపీలో చంద్ర‌బాబును ఫాలో అవుతున్న బీజేపీ!

తాము అధికారంలో లేని చోట క‌మ‌లం పార్టీ నేత‌లు అన‌విగాని నీతులు చెబుతూ ఉంటారు. అక్క‌డి ప్ర‌భుత్వాలు ఏం చేసినా.. వీరు చెప్పే శ‌త‌క‌నీతుల‌కు హ‌ద్దే ఉండ‌దు. అయితే అధికారం చేతిలో ఉందంటే మాత్రం..…

తాము అధికారంలో లేని చోట క‌మ‌లం పార్టీ నేత‌లు అన‌విగాని నీతులు చెబుతూ ఉంటారు. అక్క‌డి ప్ర‌భుత్వాలు ఏం చేసినా.. వీరు చెప్పే శ‌త‌క‌నీతుల‌కు హ‌ద్దే ఉండ‌దు. అయితే అధికారం చేతిలో ఉందంటే మాత్రం.. వీరు విమ‌ర్శించే పార్టీల‌కు పెద్ద భిన్నంగా ఉండ‌దు క‌మ‌లం పార్టీ తీరు. అందుకు యూపీ మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తూ ఉంది. అక్క‌డ తాజాగా వెయ్యి కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని మ‌హిళ‌ల ఖాతాలో జ‌మ చేశారు ప్ర‌ధాన‌మంత్రి మోడీ. 

ప‌ద‌హారు ల‌క్ష‌ల మంది స్వ‌యం స‌హాయ‌క గ్రూపుల్లోని మ‌హిళ‌ల‌కు వెయ్యి కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని జ‌మ చేశారు. యూపీ స్టేట్ స్పాన్స‌ర్డ్ స్కీమ్ కు సంబంధించిన డ‌బ్బును మోడీ చేత అకౌంట్ల‌లోకి వేసిన‌ట్టుగా ప్ర‌క‌టింప‌జేశారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రంలో ఇలాంటి ఉచిత పంచుడు కార్య‌క్ర‌మం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల‌ను టార్గెట్ గా చేసుకుని.. వారి ఖాతాల్లోకి డైరెక్టుగా డ‌బ్బును జ‌మ చేసిన‌ట్టుగా ఉన్నారు. ఏపీలోనో, తెలంగాణ‌లోనో ఇలా జ‌రిగే కార్య‌క్ర‌మాలను బీజేపీ భ‌క్తులు విమ‌ర్శిస్తూ ఉంటారు. ప్ర‌జ‌ల‌కు ఉచితంగా డ‌బ్బులిచ్చి సోమ‌రుల‌ను చేస్తున్నారంటూ ఎన‌లేని నీతులు చెబుతూ ఉంటారు. అయితే యూపీలో మాత్రం స‌రిగ్గా ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ్డ‌ప్పుడు ఉచితంగా డ‌బ్బులు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన‌మంత్రి చేతే చేయించారు!

ఈ ఉదంతం ఏపీలో చంద్ర‌బాబు చేసిన ప‌సుపు కుంకుమ కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పింప‌జేయ‌వ‌చ్చు. ఏపీలో 2019 ఎన్నిక‌ల ముందు.. స‌రిగ్గా చంద్ర‌బాబుకు ప‌సుపు కుంకుమ కార్య‌క్ర‌మం గుర్తుకు వ‌చ్చింది. మ‌హిళ‌ల ఖాతాల్లోకి డ‌బ్బులు వేశారు. ఆ కార్య‌క్ర‌మం ఎలా సాగిందంటే.. ముందుగా ప్ర‌క‌టించేసి.. రేపో ఎల్లుండో పోలింగ్ అనే స‌మ‌యం లో.. డ‌బ్బులు మ‌హిళ‌ల ఖాతాల్లోకి జ‌మ అయ్యే రేంజ్ లో ప్లాన్ చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు పంచిన ఆ డ‌బ్బుల‌తో విజ‌యంపై టీడీపీ ఫుల్ కాన్పిడెన్స్ పెంచుకుంది. 

జేసీ దివాక‌ర్ రెడ్డి లాంటి వాళ్లైతే.. చంద్ర‌బాబు చాలా తెలివైన‌వాడ‌ని, ఎలా పంచాలో అలా పంచేశాడ‌ని ఓపెన్ గా వ్యాఖ్యానించారు. అయితే చంద్ర‌బాబు క‌న్నా జ‌నాలు చాలా తెలివైన వార‌ని ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో క్లారిటీ వ‌చ్చింది. మ‌రి ఏపీలో చంద్ర‌బాబు ఫెయిల్యూర్ ఫార్ములాను యూపీలో బీజేపీ వాళ్లు ఫాలో  అవుతున్న‌ట్టుగా ఉన్నారు.