రాజకీయ నాయకులు కాలం కలిసివచ్చినంత కాలం చాలా చురుగ్గా ఉంటారు. కాలం మనది కాదనుకుంటే గమ్మున ఉండిపోతారు. మళ్ళీ మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు ఉనికిని కాపాడుకోవడానికి యాక్టివ్ అవుతుంటారు. ఇందుకు రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి కాపు రిజర్వేషన్ల ఉద్యమం పేరుతో పక్కలో బల్లెంలా మారి, ప్రతి రోజూ వార్తల్లో వ్యక్తిగా నిలిచిన నాయకుడు ముద్రగడ పద్మనాభం.
ఒకవిధంగా చెప్పాలంటే చంద్రబాబును దాదాపు నిద్ర పోనివ్వలేదు. కాపు జాతికి అన్యాయం జరుగుతోందంటూ ఆర్తనాదాలు చేశాడు ముద్రగడ. జగన్ అధికారంలోకి రాగానే ఉలుకూ పలుకూ లేకుండా గమ్మున అయిపోయి కాపు ఉద్యమం కాడిని కింద పడేశాడు. కానీ కొంతకాలంగా తెలుగు సీఎంలకు లేఖలు రాస్తూ యాక్టివ్ అవుతున్నాడు. అసెంబ్లీలో చంద్రబాబు ఎపిసోడ్ పై ఆయనకు బహిరంగ లేఖ రాశాడు.
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు తనను, తమ కుటుంబాన్ని అవమానించారంటూ చంద్రబాబు సవాల్ చేసి అసెంబ్లీ నుండి వాకౌట్ చేయడం, ఆ తరువాత పార్టీ కార్యాలయంలో వెక్కివెక్కి ఏడవడం తెలిసిందే. ఈ ఘటనను పురస్కరించుని ముద్రగడ .. చంద్రబాబుకు లేఖ రాశారు. గతంలో టీడీపీ హయాంలో తన కుటుంబంపై చేసిన దాష్టీకాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబును విమర్శించారు.
నాడు మా కుటుంబానికి చేసిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాల్సింది. మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య చేసుకోవడం మానుకున్నాను. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం దీక్ష ప్రారంభిస్తే అవమానించారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ ఈడ్చుకెళ్లడం చంద్రబాబుకు గుర్తు లేదా.. అంటూ లేఖలో ముద్రగడ పేర్కొన్నాడు.
ఆ తరువాత ప్రధాన మంత్రి మోడీకి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలంటూ లేఖ రాశారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే భవిష్యత్తులో అనేక చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని ముద్రగడ హెచ్చరించాడు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక సూచన చేస్తూ ముద్రగడ లేఖ రాశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు సమస్య హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ధాన్యం రైతాంగ సమస్యలపై లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీఎంలను ముద్రగడ కోరారు. పాడైన ధాన్యం నుండి ఆర్ ఎస్ స్పిరిట్ తయారు చేసే పరిశోధనలు చేయించాలని సూచించారు. పరిశోధనలు ఫలిస్తే జిల్లాకు ఒక స్పిరిట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తద్వారా ధాన్యానికి మద్దతు ధర సమస్య ఉండదని అన్నాడు. నిత్యం నీరు ఉండే పొలాల్లో వరి తప్పించి వేరే పంట కష్టమని ముద్రగడ పేర్కొన్నారు.
ఏపీ ప్రజలకు సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆ రోజుల్లో కోడిపందాలకు ఉన్న విశిష్టతను చెబుతూ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ముద్రగడ ఈమధ్య ఓ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఐదు రోజులూ కోడిపందాల పర్మిషన్‌కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు ఆచారమన్నాడు.
ఇటీవల సంక్రాంతికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని లేఖలో ప్రస్తావించిన ముద్రగడ చివరికి పర్మిషన్ ఇవ్వడానికి పోలీస్ శాఖ కూడా ఇబ్బంది పడుతోందని వాపోయారు. పండుగల సమయంలో ప్రజలకు పెద్దగా వేరే కూడా పని కూడా ఉండదు కాబట్టి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారని, అలాంటి సెలబ్రేషన్స్‌కు పర్మిషన్ ఇవ్వాలని ఆయన విన్నవించాడు. ముద్రగడ రాసిన ఈ లేఖతో ఆయనపై రాజకీయవర్గాల్లో మరోసారి చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
మొన్నటి దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరిగిన ముద్రగడ తాజాగా తన అడుగులును అధికార పార్టీ వైసీపీ వైపు వేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి కోడి పందాల లేఖే కాదు అప్పట్లో ఓసారి కాపుల రిజర్వేషన్ల అంశం గుర్తు చేస్తూ తమ జాతికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలంటూ సీఎంకు ఓ లెటర్ రాశాడు. అడగనివారికి, అడిగిన వారికి అన్నీఇస్తూ దానకర్ణుడిలా వ్యవహరిస్తున్న మీరు, మీ పదవిని మూణాళ్ల ముచ్చటగా కాకుండా పూజలందుకునేలా ఉండాలంటూ సూచించాడు.
దానకర్ణుడు అనే మాటే, ముద్రగడపై విమర్శల వర్షానికి గేట్లెత్తింది. ఈ మాటను పట్టుకుని అప్పట్లో సోషల్ మీడియాలో కొందరు కాపు నేతలు, ముద్రగడపై మండిపడ్డారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయారా అంటూ విమర్శించారు. ఈ మాటలతో హర్ట్ అయిన ముద్రగడ కొన్నాళ్లు రాజకీయ పరమైన అన్ని అంశాలకు దూరంగా ఉన్నాడట. ఈమధ్య వైసీపీ ప్రభుత్వం కాపులకు చాలా ప్రాధాన్యతనిచ్చింది. కాపు నేస్తం వంటి పథకాలు ప్రవేశపెట్టి, వేలాది కాపు కుటుంబాలను ఆదుకుంది. కాపు నేతలకు సైతం మంత్రి మండలితో పాటు పలు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇచ్చింది.
దీంతో రిజర్వేషన్ల అంశం పక్కకుపోయి, వైసీపీ పట్ల కాపులు సంతోషంగా వున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ముద్రగడ కూడా, దానకర్ణుడు అని జగన్‌ను లేఖలో కీర్తించడం ఇందుకే అనే వారున్నారు. ఇక నుంచైనా తాను రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలని అనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఏమైనా, రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యేందుకే, ముద్రగడ కాపు ఉద్యమాన్ని పక్కకు పెట్టాడని కాపువర్గాల్లో చర్చ జరుగుతోంది.