చాట్ జీపీటీ తురుము, తోపు అనేవారితో పాటు.. అది పరమ వేస్ట్ అనేవారు కూడా ఉన్నారు. అసలు చాట్ జీపీటీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. దానికి లైవ్ ఎగ్జాంపులే ఈ పరీక్ష. అవును, చాట్ జీపీటీ మనం అనుకున్నంత తోపు ఏమాత్రం కాదు. అది కనీసం యూపీఎస్సీ ప్రిలిమినరీ టెస్ట్ కూడా పాస్ కాలేకపోయింది.
2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్-1ని చాట్ జీపీటీకి ఇస్తే 100 మార్కులకు కేవలం 54మార్కులే వచ్చాయి. ఆ పేపర్ లో ఆలిండియా ఓపెన్ కేటగిరీ కటాఫ్ మార్కులు 87.54 . అంటే చాట్ జీపీటీ యూపీఎస్సీ పరీక్షల్లో దారుణంగా విఫలమైంది. అనాలటిక్స్ ఇండియా మేగజీన్ చాట్ జీపీటీతో యూపీఎస్సీ పరీక్ష నిర్వహించి ఫలితాలు బయటపెట్టింది.
గతంలో పెన్సిల్వేనియా యూనివర్శిటీ ఎంబీఏ క్వశ్చన్ పేపర్ కి టపీపటీమని ఆన్సర్లు ఇచ్చిందట చాట్ జీపీటీ. కానీ ప్రపంచంలోనే అత్యంత కఠినంగా ఉండే మన యూపీఎస్సీ ఎగ్జామ్ ని మాత్రం చాట్ బాట్ క్లియర్ చేయలేకపోయింది.
2022 నవంబర్ లో అందుబాటులోకి వచ్చిన చాట్ జీపీటీకి 2021కి ముందు జరిగిన కరెంట్ అఫైర్స్ పెద్దగా తెలియవు. దానికి తోడు అప్ టు డేట్ కరెంట్ అఫైర్స్ లో కూడా దానికి పెద్ద పరిజ్ఞానం లేదు. కానీ యూపీఎస్సీ పరీక్షల్లో అడిగిన జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ కి కూడా చాట్ జీపీటీ కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పలేకపోయిన విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షకు ప్రతి ఏడాది 11 నుంచి 12 లక్షలమంది దరఖాస్తు చేసుకుంటారు. వారిలో కేవలం 5 శాతం మంది మాత్రమే మెయిన్స్ కి క్వాలిఫై అవుతారు. అలాంటి టఫ్ పరీక్షలో చాట్ జీపీటీ బోల్తా కొట్టింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. క్వశ్చన్ పేపర్ లో ఉన్న 4 ఆప్షన్లు కాకుండా చాట్ జీపీటీ తనకు తానే నన్ ఆఫ్ ది అబౌ అనే ఆప్షన్ కి ఎక్కువగా టిక్ పెట్టింది. అంటే తనకు తెలియకపోతే అది నన్ ఆఫ్ ది అబౌ అనేసేలా ఉంది చాట్ జీపీటీ.