క‌మ‌లాపురంలో ఏంటీ న‌ర‌కం?

రేణిగుంట నుంచి తాడిప‌త్రికి వెళ్లే జాతీయ ర‌హ‌దారిలో క‌మ‌లాపురం అనే చిన్న ప‌ట్ట‌ణం వుంటుంది. ఇది నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం. ఇక్క‌డి నుంచి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వ‌రుస‌గా రెండోసారి…

రేణిగుంట నుంచి తాడిప‌త్రికి వెళ్లే జాతీయ ర‌హ‌దారిలో క‌మ‌లాపురం అనే చిన్న ప‌ట్ట‌ణం వుంటుంది. ఇది నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం. ఇక్క‌డి నుంచి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వ‌రుస‌గా రెండోసారి ఆయ‌న క‌మ‌లాపురం నుంచి గెలుపొందారు. జీవితంలో ఒక్క‌సారైనా ఎమ్మెల్యే కావాల‌నే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఆకాంక్ష‌ను ఆ నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు నెర‌వేర్చారు. అది కూడా రెండుసార్లు.

క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎంతో సేవ చేయాల్సిన ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, ఆ విష‌యాన్ని మాత్రం విస్మ‌రించార‌నే విమ‌ర్శ‌లున్నాయి. జాతీయ ర‌హ‌దారిలో క‌మ‌లాపురం ప‌ట్ట‌ణ స‌మీపంలోని పాపాగ్ని బ్రిడ్జి ప‌డిపోయి మూడేళ్ల‌వుతున్నా ఇంత వ‌ర‌కూ మ‌ర‌మ్మ‌తుకు నోచుకోవ‌డం లేదు. దీంతో భారీ వ‌ర్షాలు కురిసి, పాపాగ్ని న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తే జాతీయ ర‌హ‌దారిలో ర‌వాణాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతోంది.

గ‌త మూడు నాలుగు రోజులుగా క‌డ‌ప జిల్లాలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంక‌లు, న‌దులు పొంగి పొర్లుతున్నాయి. క‌మ‌లాపురం స‌మీపంలోని పాపాగ్ని న‌ది కూడా ఉధృతంగా ప్ర‌హ‌సిస్తోంది. ఇక్క‌డ మూడేళ్ల క్రితం బ్రిడ్జి కూలిపోవ‌డంతో తాత్కాలికంగా న‌దిలో రోడ్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడా రోడ్డుపై కూడా నీళ్ల ప్ర‌వాహం ఉధృతంగా ఉంది. దీంతో జాతీయ ర‌హ‌దారిపై రాక‌పోక‌లు స్తంభించాయి.

ముఖ్యంగా చెన్నై, తిరుపతి వెళ్లే వాహనాలు, అటు వైపు నుంచి తాడిప‌త్రి, అనంత‌పురం బ‌ళ్లారి, ఉర‌వ‌కొండ త‌దిత‌ర మార్గాల వైపు వ‌చ్చే వాహ‌నాలకు అంత‌రాయం ఏర్ప‌డింది. పాపాగ్ని న‌దిపై ఒక వైపు కూలిన బ్రిడ్జి నిర్మాణానికి కూడా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఎలా అని క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డిని జ‌నం నిల‌దీస్తున్నారు. మేన‌ల్లుడు ముఖ్య‌మంత్రిగా ఉండి కూడా నిధులు మంజూరు చేయించ‌లేని దుస్థితిలో ఉన్నారా? అని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. 

పాపాగ్ని న‌దిలో కేవ‌లం అప్రోచ్ రోడ్డుతో ఎంత కాలం నెట్టుకొస్తార‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఇప్ప‌టికైనా బ్రిడ్జి మ‌ర‌మ్మతుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌జానీకం కోరుతున్నారు.