మధ్య నిషేధం అన్నారు … మందు బాబులను పెంచుతున్నారు

ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే దశలవారీ మందును బంద్ చేస్తామని, చివరాఖరుకు ఏపీ మద్యం ఊసే లేకుండా చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. మందు బంద్ చేయకపోగా మందు…

ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే దశలవారీ మందును బంద్ చేస్తామని, చివరాఖరుకు ఏపీ మద్యం ఊసే లేకుండా చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. మందు బంద్ చేయకపోగా మందు బాబుల సంఖ్యను పెంచుతున్నారు. పైగా జగన్ తాను బైబిల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించే నవరత్నాల్లో మద్య నిషేధం అనేది ఒక అంశంగా చేర్చారు.

చివరకు మందును బంద్ చేసే పని గాలికి కొట్టుకుపోయింది. ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఒక సందర్భంలో మందును బంద్ చేయడం ఏ ప్రభుత్వం వల్ల కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రోశయ్య చెప్పింది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించని జగన్ తాను మరో మహాత్ముడి మాదిరిగా మందు బంద్ చేస్తానని గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆదర్శాలు ఆయన్ని కమ్ముకున్నాయి.

ఆ ఊపులో జనం చేత తాగుడు మాన్పించాలనే ఉద్దేశంతో మద్యం ధరలను విపరీతంగా పెంచారు. మద్యాన్ని తాగే అలవాటు తగ్గించడంలో భాగంగానే.. ధరలను కూడా భారీగా పెంచామన్నారు. “తాగితేకాదు.. ముట్టుకుంటేనే షాక్ కోట్టేలా ధరలు పెంచుతాం. దీంతో మద్యం తాగే వారు తగ్గిపోతారు“ అని చెప్పారు. కానీ తాజాగా మద్యం ధరలను సర్కారు బాగా తగ్గించేసింది.

ఈ పనివల్ల మందు బాబులు పెరుగుతారా? తగ్గుతారా? వైసీపీ అధికారంలోకి రాగానే.. మద్యం దుకాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. బార్లు తప్ప వైన్ షాపులను సర్కారే నిర్వహిస్తోంది. గతంలో లాక్డౌన్ సమయంలో 40 రోజలు మందు షాపులు ఎక్కడా తెరవలేదు. దీంతో మందుబాబులు అలవాటు మానుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మళ్లీ అన్నింటికన్నా ముందు మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది .

కొంతకాలం కిందట ధరలు తగ్గించగా ఇప్పుడు మరోసారి.. ధరలు తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంది. వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మీద  5 నుంచి 12 శాతం తగ్గించింది. అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరలను తగ్గించనుంది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న మద్యాన్ని, నాటుసారా తయారీని అరికట్టేందుకు ధరల తగ్గింపునకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.  మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరింతగా తాగేవారు పెరుగుతారు. 

ప్రముఖ బ్రాండ్లను కూడా ప్రవేశ పెడుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జగన్ సర్కారు ఆధ్వరంలో.. నడుపుతున్న వైన్ షాపుల్లో.. బ్రాండెడ్ మద్యం అమ్మడం లేదు. ఎవరో.. ఎక్కడో తయారు చేసుకున్న మందును తీసుకువచ్చి.. పేరు ఊరు ఎప్పుడూ.. ఎవరూ వినని వాటిని అమ్ముతున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతున్న మాట వాస్తవమే. దీంతో ఇప్పుడు బ్రాండెడ్ సరుకు కూడా తొందరలో  అందుబాటులోకి తెస్తున్నట్టు సర్కారు తెలిపింది. దీన్నిబట్టి మద్య నిషేధం అనేది జగన్ ప్రభుత్వం వల్ల అయ్యే పనికాదని తేలిపోయింది.