మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి జనం మధ్యకు రానున్నారు. ఇటీవల భువనేశ్వరి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే.
తన భార్యను దూషించడంపై మనస్తాపం చెందిన చంద్రబాబు… ఇక మీదట సీఎంగా తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేశారు. భువనేశ్వరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పడంతో ప్రస్తుతానికి వివాదం సర్దుమణిగింది.
ఈ పరిస్థితుల్లో భువనేశ్వరి జనంతో మమేకం కావడానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె సోమవారం తిరుపతి రానున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ఆమె అందించనున్నారు.
ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో వరదల తీవ్రతకు ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. మొత్తం 48 కుటుంబాలకు భువనేశ్వరి ఆర్థిక సాయం చేయనున్నట్టు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మనవరాలు పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు చంద్రబాబు దంపతులు తిరుపతి వస్తున్నట్టు సమాచారం. పెళ్లి అనంతరం తన తండ్రి పేరుతో నిర్వహిస్తున్న సంస్థ ట్రస్టీగా భువనేశ్వరి సేవా కార్యక్రమాల్లో పాల్గొననుండడం విశేషం.