హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇప్పుడు సినిమాలు తగ్గించి ఉండొచ్చు. కానీ ఆయన క్రేజ్ మాత్రం చెక్కుచెదరనిది. ఇప్పటికీ కామిక్ ఎమోజీల్లో బ్రహ్మానందం ముఖకవళికలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. టాలీవుడ్ లెజెండ్ కమెడియన్స్ లో ఒకరిగా గుర్తింపు దక్కించుకున్న బ్రహ్మానందం, సినిమాలు తగ్గించి ఏం చేస్తున్నారు? దీనికి సమాధానం ఆయన మాటల్లోనే..
“మై ఎక్స్ పీరియన్స్ విద్ గాడ్ అనే పుస్తకం రాస్తున్నాను. నేను పుట్టినప్పట్నుంచి నా లైఫ్ మొత్తాన్ని దేవుడితో అనుసంధానం చేసి రాస్తున్నాను. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టాను. అక్కడ్నుంచి అలా ట్రావెల్ చేస్తున్నాను. నా బండిని అలా తోలుకుంటూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వరకు వెళ్లాను, పద్మశ్రీ అందుకున్నాను. చాలామంది నన్ను సెల్ఫ్ మేడ్ మేన్ అంటారు. కానీ నా ఈ స్థితికి కారణం నా కష్టం మాత్రమే కాదు, నా లైఫ్ లో ప్రతి మలుపులో కనిపించింది దేవుడు. నా లైఫ్ లో ఏం జరిగిందో నాలోనేను అనుకునే కంటే, 4 ముక్కలు పేపర్ మీద రాస్తే, భవిష్యత్తులో ఎవరైనా చూసి, నేను దేవుడ్ని నమ్మాను కాబట్టి, నా పుస్తకం చదివి ఒక్కడైనా దేవుడ్ని నమ్మితే అదే చాలు. అందుకే ఆ పుస్తకం రాస్తున్నాను.”
తను రాసేది పూర్తిస్థాయి ఆటోబయోగ్రఫీ కాదంటున్నారు బ్రహ్మానందం. కేవలం తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు, కీలక మలుపుల్ని మాత్రమే ప్రస్తావిస్తానని స్పష్టంచేశారు. ఆ సందర్భాల్లో తనకు దైవం ఎలా సహాయం చేసింది, దేవుడ్ని నమ్మితే అంతా మంచి జరుగుతుందనే భావాన్ని తన పుస్తకం ద్వారా వెల్లడించాలనుకుంటున్నట్టు తెలిపారు.
షూటింగ్స్ లో కండిషన్స్ పెడతారనే విమర్శపై స్పందించిన బ్రహ్మానందం.. ముందే తను టైమింగ్స్ చెబుతానని, ఇచ్చిన టైమ్ దాటిన తర్వాత సెట్స్ లో తను కనిపించనని తెగేసి చెప్పారు. తన టైమింగ్స్ నచ్చితేనే సినిమాల్లోకి తీసుకోవాలని, లేదంటే తనను సంప్రదించొద్దని కరాఖండిగా చెప్పేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో 5 సినిమాలు చేస్తున్నానని తెలిపారు బ్రహ్మి. అందులో భీమ్లానాయక్ కూడా ఒకటి.