అభివృద్ధి, అధికార వికేంద్రీకరణే తమకు కావాలని తిరుపతి సభ నినదించింది. మూడు రాజధానులు మద్దతుగా శనివారం తిరుపతి ఇందిరా మైదానంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మూడు ప్రాంతాలకు చెందిన పలువురు మేధావులు, రాయల సీమ ఉద్యమకారులు మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల సమాన అభివృద్ధి ఆవశ్యకతను వివరించారు.
అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమైయితే మిగతా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలోనే ఏకైక రాజధాని ఉండాలనే డిమాండ్ తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. సాగు, తాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజనకు దారి తీసిన పరిస్థితుల నుంచి చంద్రబాబు గుణపాఠాలు నేర్చుకోకుండా, మరోసారి అలాంటి తప్పిదానికే ఆయన శ్రీకారం చుట్టారన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించి అభివృద్ధినంతా అక్కడే కేంద్రీకరించి, మరోసారి వేర్పాటువాద ఉద్యమాలకు చంద్రబాబు బీజం వేశారని ఆరోపించారు.
బాబు హయాంలో జరిగిన తప్పును నేటి ప్రభుత్వం సరిదిద్దాలని కోరారు. స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ అమరావతి నినాదం ఎత్తుకొందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని అది జరగాలంటే ఉత్తరాంధ్ర, రాయల సీమల్లోనూ రాజధానులు ఉండాలని తెలిపారు.