ప్రశ్నించడానికే జనసేన పార్టీని స్థాపించానని గర్వంగా చెప్పుకునే పవన్‌కల్యాణ్, ఆచరణ విషయానికి వస్తే అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా విశాఖ ఉక్కు పరిరక్షణకు జనసేన డిజిటల్ ఉద్యమాన్ని చేపట్టినట్టు పవన్ ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎవరైనా, ఏ విధంగా పోరాడినా అభినందించాల్సిందే.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఇటీవల వరుసగా పవన్‌కల్యాణ్ రకరకాలుగా తన నిరసన ప్రకటిస్తున్నారు. అయితే అసలు నిందితులను విడిచి, కొసరును విమర్శించడమే ఆయన చిత్తశుద్ధిని అనుమానించేలా చేస్తోంది. ఇప్పటికీ ఆయన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడానికి కారణం ఏంటనేది అర్థం కావడం లేదు. గబ్బర్‌సింగ్ భయపడుతున్నారా? అని నెటిజన్లు గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
“విశాఖ ఉక్కు పరిరక్షణకే లక్ష్యంగా జనసేన తరపున ఈ నెల 18,19,20 తేదీల్లో డిజిటల్ ఉద్యమం చేపడదాం. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దు అన్న నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలి. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలకు బాధ్యత గుర్తు చేయాలన్న లక్ష్యంతో డిజిటల్ ప్రచారం చేద్దాం. వైసీపీతో పాటు టీడీపీ ఎంపీలు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ ఉక్కు పరిరక్షణపై మాట్లాడాలి. ప్లకార్డులు ప్రదర్శించాలి. వారికి ఆ బాధ్యత గుర్తు చేసేలా మన రాష్ట్ర రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్టులు పెట్టాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విషయం పార్లమెంట్‌కు తెలియజేయాలని మన ఎంపీలను సామాజిక మాధ్యమాల్లో కోరదాం” అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. అయితే పవన్‌కల్యాణ్ వ్యూహాత్మక పిలుపును నెటిజన్లు పసిగట్టి నిలదీస్తున్నారు.
“విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని వైసీపీ, టీడీపీ ఎంపీలను ట్యాగ్ చేస్తూ, ట్విటర్ ప్రచారం చేయాలని జనసేన నిర్ణయించడం బాగుంది. అయితే గబ్బర్ సింగ్‌లో ఇంత పిరికితనం ఉందని గుర్తించలేకపోయాం. ఈ సమస్యపై ట్విటర్‌లో ట్యాగ్ చేయాల్సింది ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని. అంతేగాని, అన్ని వేదికలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రజాప్రతినిధులను కాదు సార్” అని నెటిజన్లు తమదైన శైలిలో పవన్‌పై పంచ్‌లు విసరడం విశేషం.
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న కామెంట్లను చూసిన తర్వాతైనా పవన్‌కల్యాణ్ తాను ప్రశ్నించాల్సింది ఎవరినో తెలుసుకోవాలి. అప్పుడు వైసీపీ, టీడీపీ ఎంపీలతో పాటు ప్రధాని, కేంద్ర హోంమంత్రిలను కూడా ట్విటర్‌లో ట్యాగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తన తప్పును సరిదిద్దుకుంటారేమో చూద్దాం.