రాజకీయాల్లో ప్రజల అభిమానం పొందడానికి,ఓట్లను కొల్లగొట్టడానికి నాయకుల వద్ద రకరకాల ఉపాయాలు ఉంటాయి. అలాంటి వాటిలో ప్రజల సానుభూతి సంపాదించడం అనేది ఒకటి. ఆ సానుభూతి కోసమూ అనేక రకాల టెక్నిక్స్ అనుసరిస్తుంటారు. చూడబోతే.. ఇలాంటి సానుభూతి పొందడానికి కర్ణాటకలోని మూడు పార్టీల కీలక నాయకులకు.. చంద్రబాబునాయుడు స్ఫూర్తి అందిస్తున్నట్టుగా ఉంది.
‘లాస్ట్ చాన్స్’ అనే మాట ప్రయోగిస్తూ.. నా జీవితానికి ఇది ఆఖరు అధ్యాయం, నన్ను గెలిపించండి అని ఏపీలో బతిమాలుతున్న చంద్రబాబునాయుడు అదే తరహాలో ‘చివరి ఎన్నికలు’ అనే పదాన్ని ప్రయోగిస్తూ పొలిటికల్ మైలేజీ సాధించాలనే ఆలోచనను కన్నడ నాయకులకు అందిస్తున్నట్టుగా ఉంది. అక్కడ మూడు కీలక పార్టీలకు చెందిన ముగ్గురు అగ్రనేతలు ఇదే పాట పాడుతున్నారు.ఈ ముగ్గురూ మాజీ ముఖ్యమంత్రులే కావడం ఇంకో తమాషా.
భారతీయ జనతా పార్టీ నాయకుడు యడ్యూరప్ప ఏకంగా తన రిటైర్మెంట్ నే ప్రకటించేశారు. నిజానికి వయస్సు మళ్లిన నేతలను బిజెపి పార్టీ కార్యకలాపాలకే పరిమితం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ ఆ చర్య తీసుకోకముందే యడ్యూరప్ప రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ సామాజిక వర్గాల పరంగా యడ్యూరప్ప ఆ పార్టీకి చాలా అవసరం. అందుకని ఆయన తన కులాన్ని సమీకరించడానికి, వారితో సానుభూతి, సానుకూల ఓటు పొందడానికి ‘చివరి ఎన్నికలు’ అస్త్రం బయటకు తీశారు. ఈ ఎన్నికల తర్వాత.. అసలూ పూర్తిగా పార్టీ పని నుంచి కూడా పక్కకు తప్పుకుంటానని అంటున్నారు. అంటే.. తన ప్రతిష్ఠ నిలబెట్టడానికి ఈ చివరి ఎన్నికల్లో కులం మొత్తం సహకరించి బిజెపిని గెలిపించాలని సంకేతం ఇవ్వడం ఆయన ఉద్దేశం కావొచ్చు.
కాంగ్రెసు పార్టీ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఇవి తన చివరి ఎన్నికలు అని ప్రకటించేశారు. ఈ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ గెలిచినా సరే.. ముఖ్యమంత్రి పీఠం మళ్లీ ఆయన చెంతకు వస్తుందో లేదో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో ఇవే చివరి ఎన్నికలు అని ఆయన ప్రకటించేయడం విశేషం. ఆ మాట ద్వారా ఆయన ఎందరు ఓటర్లని కొత్తగా ఆకర్షిస్తారో కూడా తెలియదు.
ఈ ఇద్దరు ‘చివరి ఎన్నికలు’ అనే మాట వాడుతున్నారు కదా, తాను వాడకపోతే బాగుండదని అనుకున్నారేమో తెలియదు గానీ.. జేడీఎస్ నాయకుడు కుమారస్వామి కూడా అదే పాట అందుకున్నారు. ఆయన మరీ వీరి స్థాయి వృద్ధుడు కాదు కదా అనే అనుమానం ఎవరికైనా కలగవచ్చు. కానీ, పదం అదే వాడుతున్నారు గానీ.. ఆయన అందులో చాలా మెలికలు పెడుతున్నారు. ఈ ఎన్నికలు కాదు, దీని తర్వాత వచ్చే 2028 ఎన్నికలు తనకు చివరివని అంటున్నారు. అందులో మెలిక ఏంటంటే.. అసెంబ్లీకి పోటీచేయడంలో మాత్రమే చివరి ఎన్నికలట. ఆ తర్వాత ఇతర ఎన్నికల్లో పోటీచేస్తూ కొనసాగుతారట. అంటే.. 2028 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే అభిలాష ఉన్నట్టుగా కుమారస్వామి సంకేతాలు ఇస్తున్నట్టుంది.
చంద్రబాబునాయుడు ఏదో.. నాకు ముసలి తనం వచ్చేసింది.. పద్నాలుగేళ్లు సీఎంగా చేశాను. ఇంకోసారి ఆ పదవి వైభోగం కావాలి.. మళ్లీ నన్ను సీఎం చేయండి.. ఇదే నాకు లాస్ట్ చాన్స్ అని ఏపీలో బతిమాలుతున్నారు. ఆయనకు వర్కవుట్ కావడమే కష్టంగా ఉంది. ఆయన నుంచి స్ఫూర్తి అందుకుని.. వీరంతా ‘చివరి ఎన్నికలు’ పాట పాడితే వారికి ఎంత మాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి.