రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం విషయంలో ఏపీ సీఎస్ ధిక్కారానికి పాల్పడ్డారనే ఫిర్యాదుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చైన్నై ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సీఎస్ ధిక్కారానికి పాల్పడలేదని, చర్యలు అవసరం లేదని ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే అనుమతులపై కీలక ఆదేశాలు ఇచ్చింది.
కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టొద్దని ఎన్జీటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దంటూ గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ధిక్కరిస్తూ ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతోందని తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్జీటీ తన నిర్ణయాన్ని వెలువరించింది.
ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కారం చర్యలు అవసరం లేదని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎన్జీటీ స్పష్టం చేసింది.
ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందననే ఆసక్తి నెలకుంది. ఎందుకంటే ఈ పథకం కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ జీవనాడి. ఈ పథకం పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది.