ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడాయన. వైఎస్ ని కూడా ఢీకొట్టి 'ఢీ'ఎస్ అన్నారు, సీఎం కుర్చీకి సైతం పోటీ పడ్డారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో, డీఎస్ పరిస్థితి కూడా అలాగే తయారైంది.
అందుకే ఆయన టీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. కానీ అక్కడ కేసీఆర్ రాజకీయాలను తట్టుకుని నిలవడం, మనుగడ సాగించడం, మనసు చంపుకుని ఉండటం ఆయన వల్ల కాలేదు. కేకే లాగా డీఎస్ సర్దుకోలేకపోయారు. అదను కోసం వేచి చూశారు, బయటకొచ్చి తిరిగి కాంగ్రెస్ గూటిలోకి వెళ్లబోతున్నారు.
డీఎస్ తో కాంగ్రెస్ కి ఉపయోగం ఏంటి..?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతోంది. తెలంగాణ ఇచ్చామన్న పేరు ఉన్నా కూడా అక్కడ టీఆర్ఎస్ దే అధికారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. రాగా పోగా కాంగ్రెస్ కంటే బీజేపీయే అక్కడ బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తే వారికి కండువా కప్పేస్తోంది.
సీనియర్లు అంతమంది ఉండగా.. టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఛీకొట్టి బయటికెళ్లిన డీఎస్ ని కూడా ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కానీ డీఎస్ తో కాంగ్రెస్ కి అదనంగా కలిగే ప్రయోజనం ఏంటో వారికే తెలియాలి. కనీసం జిల్లాలో కూడా డీఎస్ కి సరైన పట్టు ఉందని చెప్పలేం.
పాత తరం రాజకీయాలు ఇప్పుడు లేవు, అప్పటి కమిట్ మెంట్ ఉన్న నేతలు డీఎస్ పక్కన కూడా ఎవరూ లేరు. అందుకే కేసీఆర్ కూడా ప్రత్యక్ష రాజకీయాలు వద్దని, డీఎస్ ని రాజ్యసభకు పంపించారు. సైడ్ ట్రాక్ లో పెట్టారు. ఇప్పుడీయన కాంగ్రెస్ లోకి వచ్చి చేసేదేంటో హస్తం పార్టీకే తెలియాలి.
తెల్ల ఏనుగు రాకతో ఫీలయ్యేవారెందరో..?
డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఆయన తనయుడు అరవింద్ బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు డీఎస్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఈ కలగాపులగం చూస్తుంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ నాయకులకు డీఎస్ రాక ఏమాత్రం ఇష్టంలేదనే చెప్పాలి. కానీ హైకమాండ్ ఆదేశాలతో లోపల కోపం ఉన్నా స్మైలీ ఫేస్ తో ఆయనకు స్వాగతం చెప్పేందుకు రెడీ అయ్యారు.
పార్టీకి ఆయన పెద్దగా పనికిరారని రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క లాంటి నేతలు ఫీలవుతున్నారు. కానీ డీఎస్ వస్తే కండువా కప్పడం తప్ప వాళ్లు చేసేదేం లేదు. రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు డీఎస్ ఎలా పనికొస్తారో చూడాలి.