నారా లోకేష్ పాపం పసితనంతో ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఏ రోటికాడ ఆ పాట పాడితే తన యాత్ర రంజుగా ఉంటుందని అనుకున్నాడో ఏమో గానీ.. యువగళం అని పేరు పెట్టుకుని ఊర్లు తిరుగుతూ.. ఏ ఊరిలో అడుగు పెడితే.. ఆ ఊరికి జగన్ ఫలానాఫలానా ద్రోహాలు చేశాడంటూ ఏకరవు పెడుతున్నారు. వాటితో సమానంగా ఆ ఊరికి తన తండ్రి పద్నాలుగేళ్ల సీఎంగా ఏం చేశాడో చెప్పుకోడానికి ఆయన దగ్గర పెద్దగా విషయం లేదు. అలాంటి నారా లోకేష్.. తిరుపతిలో పర్యటిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టుబోర్డు పదవులను జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు.
టీటీడీ బోర్డుకు సంబంధించి జగన్ మీద నిందలు వేయడానికి అవకాశం కూడా ఉంది. బోర్డుకు సలహాదారుల పేరుతో బోర్డు సభ్యులకంటె ఎక్కువ మందిని ప్రోటోకాల్ హోదాలతో నియమించేసి.. న్యాయపరంగా చిక్కులను కొని తెచ్చుకున్నారు జగన్. ఆ రకంగా చూసినప్పుడు జగన్ ఆశ్రితపక్షపాతి అంటే నడుస్తుంది. ఆశ్రితులకు మాత్రమే.. టీటీడీ బోర్డులో చోటు కల్పిస్తున్నారని, వారికోసం కొత్త పదవులను కూడా సృస్టిస్తున్నారని జగన్ మీద నింద వేయడం కుదురుతుంది. కానీ ఆ పదవుల్ని అమ్ముకుంటున్నారని అంటే మాత్రం కామెడీగా ఉంటుంది.
ఎందుకంటే.. టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవిని తన సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు జగన్. రెండు పర్యాయాలూ అదే జరిగింది. సొంత బాబాయికి ఎంత సొమ్ములకు, ఎంత ధరకు ఆ పదవిని అమ్ముకుని ఉంటారని లోకేష్ బాబు చెప్పగలరు? కాబట్టి అమ్మకం అనేది అబద్ధమూ మరియు చినబాబు గాలివాటుగా చేస్తున్న ఆరోపణ.
అయితే టీటీడీ పదవులను అడ్డగోలుగా దుకాణంలో పెట్టి మరీ అమ్మేసిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. ఆయనకు డబ్బు ఒక్కటే ప్రయారిటీ. ఆ పదవిని అమ్ముకోవడం ద్వారా.. తన పర్సనల్ ఖజానాకు ఎంత సొమ్ములు జమ అవుతున్నాయి అనేది ఒక్కటే ప్రయారిటీ.. తతిమ్మా మరే విషయాలూ పట్టవు. ఆ వ్యక్తి తన పార్టీకి చెందినవాడా? ప్రత్యర్థి పార్టీలకు చెందినవాడా అనే విషయాలు కూడా ఆయన పట్టించుకోరు.
ఆ ప్రకారంగానే.. వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్ కు కూడా సన్నిహితుడనే ముద్ర ఉన్న శేఖర్ రెడ్డికి కూడా చంద్రబాబు తన హయాంలో టీటీడీ బోర్డు పదవిని కట్టబెట్టేశారు. మామూలుగా దేశంలో ఎంత మహానుభావులైనా, ఎంతటి కొమ్ములు తిరిగిన సంపన్నులైనా సరే.. టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని ఓ అద్భుతమైన అవకాశంగా భావిస్తారు. అలాంటిది పదవి ఇస్తే.. ప్రమాణస్వీకారానికి కూడా రాకుండా, తమకు ఖాళీ దొరికినప్పుడు వచ్చి ఆ పదవిని పుచ్చుకునే అహంకారులకు కూడా చంద్రబాబునాయుడు పదవులు అమ్మాడు.
ఒక్క టీటీడీ పదవులు మాత్రమే కాదు.. రాజ్యసభ పదవులను సైతం కేవలం డబ్బులకు అమ్మేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందని లోకేష్ మరచిపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆబ్లిగేషన్ల కారణంగా జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా కొత్తగా రాజ్యసభ పదవి లాంటిది ఇవ్వాల్సి వస్తే.. వారిని పార్టీలో చేర్చుకున్న తర్వాతే ఇచ్చారే తప్ప.. చంద్రబాబులాగా వారి వద్దకు పదవిని తీసుకెళ్లి సాగిలపడి మరీ సమర్పించుకోలేదనే సంగతి చినబాబు తెలుసుకోవాలి.