ఐవైఆర్‌.. వైఎస్సార్సీపీలోకి దూకేందుకు సిద్ధమే

ఆంధ్రప్రదేశ్‌ మాజీ చీఫ్‌ సెక్రెటరీ, ప్రస్తుత బీజేపీ నేత ఐవైఆర్‌ కృష్ణారావు, చంద్రబాబు హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పనిచేయడం, ఈ క్రమంలో ఆయన ప్రభుత్వంతో విబేధించి బయటకు వచ్చేయడం తెల్సిన విషయాలే. ప్రస్తుతం…

ఆంధ్రప్రదేశ్‌ మాజీ చీఫ్‌ సెక్రెటరీ, ప్రస్తుత బీజేపీ నేత ఐవైఆర్‌ కృష్ణారావు, చంద్రబాబు హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పనిచేయడం, ఈ క్రమంలో ఆయన ప్రభుత్వంతో విబేధించి బయటకు వచ్చేయడం తెల్సిన విషయాలే. ప్రస్తుతం బీజేపీ నేతగా వున్న ఐవైఆర్‌ కృష్ణారావుకి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని వుందట. 'బీజేపీని వీడేందుకు సిద్ధంగా లేను..' అని ఆయన పైకి చెబుతున్నారుగానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సేవలందించాలనుకుంటున్నట్లు మాత్రం ప్రకటించారాయన. అదెలా కుదురుతుంది.?

ఏమోగానీ, ప్రస్తుత రాజకీయాలపై ఐవైఆర్‌ కృష్ణారావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, సెక్రెటేరియట్‌.. రెండూ ఒకే చోట వుండాలంటున్న ఐవైఆర్‌ కృష్ణారావు, వివిధ శాఖల హెచ్‌వోడీ కార్యాలయాలు మాత్రం ఆయా జిల్లాల్లో వుంటే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఓ ఛానల్‌ ప్రతినిథి చేసిన ఇంటర్వ్యూలో ఐవైఆర్‌ కృష్ణారావు, తన మనసులో భావాల్ని వెల్లడించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదేననీ, అధికార వికేంద్రీకరణ అనేది అస్సలేమాత్రం సబబు కాదని ఐవైఆర్‌ కృష్ణారావు చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలా అవకాశాలున్నాయంటున్న ఐవైఆర్‌, చంద్రబాబు హయాంలో పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ స్పష్టమైన తేడా వున్నప్పటికీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందంటూ సగటు బీజేపీ నేత తరహాలోనే విమర్శలు చేశారు.

అధికారంలోకి వచ్చి ఆర్నెళ్ళు పూర్తయిపోయింది గనుక, వైఎస్‌ జగన్‌.. రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టి, పూర్తిస్థాయిలో పాలన మీద ఫోకస్‌ పెట్టాల్సి వుందనీ, సంక్షేమ పథకాలతో సమానంగా అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు అందిస్తే వైసీపీకి భవిష్యత్తు బావుంటుందనీ చెప్పుకొచ్చారు ఐవైఆర్‌ కృష్ణారావు. మొత్తమ్మీద, ఐవైఆర్‌ కృష్ణారావు, వైసీపీతో కలిసి పనిచేయాలనే ఆలోచనని పరోక్షంగా బయటపెట్టేశారన్నమాట. కానీ, 'పదవి ఇస్తే..' అని ఆయన కండిషన్‌ పెడుతున్న దరిమిలా, వైఎస్‌ జగన్‌ అందుకు ఒప్పుకుంటారా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.