ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలుగుదేశం అనుకూల మీడియాలో వణుకు పుట్టిస్తున్నట్టుగా ఉంది. జగన్ ఢిల్లీ టూర్ ఎందుకనే అంశం గురించి వీరి వెర్షన్ లు వింటుంటే వీళ్ల భయమేమిటో స్పష్టం అవుతూ ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయేలోకి చేరుతుంది అనే ఊహనే పచ్చ వర్గాలు భరించలేకపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడును మోడీ క్షమించకపోడా.. దగ్గరకు తీసుకోకపోడా అనే ఆశతోనే పచ్చ మీడియా వర్గాలు ఉన్నాయి. దీని కోసం చంద్రబాబు ఎంతలా సాగిలాపడుతున్నారో కూడా అందరికీ తెలిసిందే.
ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయేలో భాగస్వామి కానుంది, మూడు కేంద్ర మంత్రి పదవులు తీసుకుని బీజేపీకి దగ్గర కానుందనే ప్రచారం నేపథ్యంలో.. పచ్చమీడియా చాలా బాధపడిపోతూ ఉంది.
అబ్బే అలాంటిదేమీ లేదని పచ్చమీడియా చెప్పడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంది. తన మార్కు రాతలను రాస్తూ ఉంది. ఆంధ్రజ్యోతేమో.. జీఎస్ట్ బకాయిల గురించి జగన్ ను బుజ్జగించడానికి జగన్ ను ఢిల్లీకి పిలిపించారట!.
అక్కడికేదో కేంద్రం కేవలం ఏపీకి మాత్రమే బకాయిలు ఉన్నట్టుగా.. జగన్ నే పిలిపించి బుజ్జగిస్తారా! ఈ విషయంపై ఇప్పటికే జగన్ స్పందించేశారు కూడా. కరోనా కష్టకాలం కదా.. వారి దగ్గర నుంచి కాస్త లేట్ అయినా ఫర్వాలేదని ఆ మధ్య హిందుస్తాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో జగన్ తేల్చి చెప్పారు. అలాంటప్పుడు మళ్లీ ఆయనను కన్వీన్స్ చేయడానికి మోడీ పిలిపించుకుంటారా? అలా పాఠకుల చెవుల్లో పచ్చపూలు పెట్టింది ఆంధ్రజ్యోతి!
ఇక ఈనాడు రాతలు మరీ కామెడీగా ఉన్నాయి. జగన్ ఢిల్లీ వెళ్లింది ఎన్డీయేలో చేరేందుకు కాదని, జగన్ వెళ్లి మోడీతో సమావేశం అయ్యి చాలా నెలలు గడిచాయట! ఎప్పుడో ఈ ఏడాది ఫిబ్రవరిలో మోడీతో జగన్ సమావేశం అయ్యారట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సమావేశం అయ్యారట. రాష్ట్ర సమస్యల గురించి మాత్రమే వారి సమావేశం జరిగిందట. అంతకు మించిన ప్రాధాన్యత లేదట!
మొన్నటి వరకూ జగన్ ఢిల్లీకి వెళితే.. కేసుల విషయంలో అంటూ, జగన్ కు ఢిల్లీ వాళ్లు క్లాసులు పీకారంటూ రాసుకుని స్వయంతృప్తి పొందేది పచ్చమీడియా. ఇప్పుడు అలా రాయడానికి ధైర్యం లేక, అసలు విషయాలను ప్రస్తావించేందుకు మనసు రాక.. ఇలా పాఠకుల చెవుల్లో పచ్చపూలు పెడుతున్నాయి!