ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ హత్యాచార ఘటన ఆ రాష్ట్రంతో పాటు కేంద్రంలోని బీజేపీ సర్కార్ పరువు మన దేశంతో పాటు ప్రపంచ స్థాయిలో కూడా తీసిందని చెప్పొచ్చు. దీనికి నిదర్శనం ఈ దుర్ఘటనపై ఐక్యరాజ్య సమితి సమన్వయకర్త స్పందించడమే.
అయితే ఐక్యరాజ్య సమితి సమన్వయకర్త మన దేశంలోని ఘటనలపై స్పందించడాన్ని భారత ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఇవన్నీ ఎలా ఉన్నా ఒక దుర్ఘటన ప్రపంచ దృష్టిని నెగెటివ్ కోణంలో ఆకర్షించడం ఒకింత సిగ్గుచేటని పలువురు సామాజిక వేత్తలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దళిత యువతిపై సామూహిక హత్యాచారం, అదే రాష్ట్రంలో బలరామ్‌పుర్‌లో అత్యాచారానికి పాల్పడడంపై మన దేశంలోని ఐక్యరాజ్య సమితి సమన్వయకర్త స్పందన ఏంటో ముందు తెలుసుకుందాం.
“ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్, బలరామ్‌పుర్ ఘటనలు సమాజంలో బలహీన వర్గాల మహిళలు, బాలికలకు రక్షణ లేని అంశాన్ని తెలియజేస్తోంది. మహిళల రక్షణకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బలహీనవర్గాల వారి విషయంలో భద్రత సూచీలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై మన విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. ఈ అంశంపై జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
“విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై ఓ బయటి సంస్థ వ్యాఖ్యానించడం సరికాదు. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు లభిస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేకూరుతుంది” అని మన విదేశాంగ తగిన విధంగా బదులిచ్చింది. కానీ అత్యాచారాలతో పాటు అనంతరం చోటు చేసుకున్న అమానవీయ ఘటనలు మాత్రం మనం తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితులు కల్పించాయనడంలో అతిశయోక్తి లేదు.