మ‌ల‌యాళీ రీమేక్ లు.. క‌త్తిమీద సాము!

మ‌ల‌యాళీ సినిమాలు మ‌ల‌యాళీ వెర్ష‌న్లో చూసినంత వ‌ర‌కూ బాగా అనిపిస్తాయి! ఏ భాష ప్రేక్ష‌కుడిని అయినా ఇట్టే క‌ట్టిప‌డేస్తాయి! అయితే వాటిని రీమేక్ లుగా వండి వార్చిన‌ప్పుడే క‌థ మొత్తం మారిపోతుంది. క‌రోనా లాక్…

మ‌ల‌యాళీ సినిమాలు మ‌ల‌యాళీ వెర్ష‌న్లో చూసినంత వ‌ర‌కూ బాగా అనిపిస్తాయి! ఏ భాష ప్రేక్ష‌కుడిని అయినా ఇట్టే క‌ట్టిప‌డేస్తాయి! అయితే వాటిని రీమేక్ లుగా వండి వార్చిన‌ప్పుడే క‌థ మొత్తం మారిపోతుంది. క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యం నుంచి మ‌ల‌యాళీ సినిమాల‌కు విప‌రీతమైన క్రేజ్ పెరిగింది. అంత‌కు ముందు కూడా మ‌ల‌యాళీ సినిమాల‌కు ఇంటాబ‌య‌ట క్రేజ్ త‌క్కువేమీ కాదు! ద‌శాబ్దాల నుంచి మ‌ల‌యాళీ సినిమాలు రీమేక్ లు అవుతూనే ఉన్నాయి. ఇలాంటి రీమేక్ ల లో హిట్ ప‌ర్సెంటేజీ హిందీలోకే ఎక్కువ‌!

90ల‌లో మ‌ల‌యాళంలో వ‌చ్చిన కామెడీ సినిమాల‌ను హిందీలో రీమేక్ చేసి సూప‌ర్ హిట్స్ కొట్టారు. ఈ జాబితాలో బాలీవుడ్ ఆల్ టైమ్ సూప‌ర్ ఫేరాపెరీ తో స‌హా బోలెడు సినిమాలున్నాయి. అయితే స‌ద‌రు సినిమాలు తెలుగు వంటి భాష‌ల్లో రీమేక్ అయ్యి, పెద్ద‌గా గుర్తింపుకు కూడా నోచుకోలేదు. వాస్త‌వానికి హేరాఫెరీ తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. అది కూడా నాణ్య‌త‌తో కూడిన రీమేకే. ఒరిజిన‌ల్ మ‌ల‌యాళీ సినిమాను 'ధ‌న‌ల‌క్ష్మీ ఐ ల‌వ్యూ' పేరుతో రీమేక్ చేశారు! సీనియ‌ర్ న‌రేష్, అల్ల‌రి న‌రేష్ , ఆదిత్య ఓం, అంకిత‌.. ఇలా అంతా బాగానే చేశారు. ప్ర‌త్యేకించి సీనియ‌ర్ న‌రేష్ అద‌రగొట్టాడు. కామెడీని పండించ‌డంటో దిట్ట అయిన శివ‌నాగేశ్వ‌ర‌రావు ఎక్క‌డా నిరాశ ప‌ర‌చ‌డు! అయితే ఎందుకో తెలుగు వాళ్ల‌కు ఆ సినిమా న‌చ్చ‌లేదు! క‌నీసం చెప్పుకోదిగిన వ‌సూళ్ల‌ను కూడా ద‌క్కించుకోలేదు!

అయితే తెలుగులో కొన్ని మ‌ల‌యాళీ సినిమాలు తెలుగులో క‌ల్ట్ హిట్ కూడా అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన *హిట్ల‌ర్* ఇందుకు మంచి ఉదాహ‌ర‌ణ‌. మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టీ అదే పేరుతో తీసిన సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో కూడా సూప‌ర్ హిట్.

అలాగే 'పెద్ద‌రికం' కూడా మ‌ల‌యాళీ రీమేక్ ల‌లో తెలుగునాట డీసెంట్ హిట్. ఇంకా మ‌ల‌యాళంలో హిట్టైన బోలెడ‌న్ని కామెడీలు తెలుగులో రీమేక్ అయ్యాయి. గాంధీన‌గ‌రం రెండో వీధి, చిల‌క్కొట్టుడు, మా బాలాజీ.. ఇవ‌న్నీ మ‌ల‌యాళీ రీమేక్ లే. వీటి ఒరిజిన‌ల్స్ అక్క‌డ క్లాసిక్స్. తెలుగులో మాత్రం ఈ సినిమాల‌కు చెప్పుకునేంత ఏమీ లేదు. అలాగే మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన‌ ఆల్ టైమ్ సూప‌ర్ హిట్ సినిమా ఒక‌దాన్ని 'గూండాయిజం న‌శించాలి' అంటూ తెలుగులో అప్ప‌ట్లోనే రీమేక్ చేశారు. రాజ‌శేఖ‌ర్ హీరో, కోదండ‌రామిరెడ్డి డైరెక్ట‌ర్. మ‌ల‌యాళం సినీ క్రిటిక్స ఇప్ప‌టికీ దీని ఒరిజిన‌ల్ ను వ‌న్ ఆఫ్ ద బెస్ట్ మ‌ల‌యాళీ సినిమాగా చెబుతుంటారు. దాన్ని తెలుగులో ప్ర‌ముఖ హీరో, ద‌ర్శ‌కుడే రీమేక్ చేసినా.. అలాంటి సినిమా ఒక‌టి వ‌చ్చింద‌ని కూడా ఎవ‌రికీ పెద్ద‌గా తెలీనంత డిజాస్ట‌ర్ అది!

ఇక ఈ మ‌ధ్య‌కాలంలో అయ్య‌ప్ప‌నుమ్ కోషియుం, లూసీఫ‌ర్, క‌ప్పెల‌, జోసెఫ్, అంగమాలి డైరీస్, మ‌హేషింటే ప్ర‌తీకారం వంటి మ‌ల‌యాళీ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అయితే ఏ ఒక్క‌టీ కూడా ఒరిజ‌న‌ల్ ను త‌ల‌ద‌న్న‌లేదు. బ‌డ్జెట్లు, క‌లెక్ష‌న్లు, మార్పు చేర్పుల‌నూ ప‌క్క‌న పెడితే, ఒరిజిన‌ల్ వెర్ష‌న్లే బెట‌ర్ అనిపించాయి! చెప్పుకోద‌గిన స్థాయిలో రీక్రియేట్ అయిన సినిమాలు ప్రేమ‌మ్, దృశ్యం సీరిస్ లు మాత్ర‌మే! వీటిల్లో కూడా తెలుగు దృశ్యం బాక్సాఫీస్ వ‌ద్ద మూడు రోజుకే చేతులెత్తేసింది! టీవీలో ఆడింది. దృశ్యం2 డైరెక్టు ఓటీటీ రిలీజ్ గా సేఫ్ పొజిష‌న్లో నిలిచింది!

కేవ‌లం తెలుగు అనే కాదు.. ఒకానొక ద‌శ‌లో మ‌ల‌యాళీ రీమేక్ లు రాజ్య‌మేలిన హిందీలో కూడా తాజాగా మ‌రో మ‌ల‌యాళీ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ సెల్ఫీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఆ మ‌ధ్య మ‌ల‌యాళీ సినిమా క‌థా ప‌ర‌యంపోల్ మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయ్యింది. దాన్ని రీమేక్ చేయ‌డానికి స్టార్లే పోటీప‌డ్డారు. అయితే త‌మిళం, తెలుగు, హిందీ భాష‌ల్లో అది డిజాస్ట‌ర్ అయ్యింది. అలాగే బాడీగార్డ్ కూడా మ‌ల‌యాళంలో హిట్ అనిపించుకుంది కానీ, బ‌య‌ట కాదు! 

ఏతావాతా మ‌ల‌యాళీ సినిమాను ఇత‌ర భాష‌ల్లో రీమేక్ చేయ‌డం క‌త్తిమీద సాములా మారిన‌ట్టుగా ఉంది. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ను  వేరే భాషల వాళ్లు చూసేశారంటే, ఇక చూడ‌టానికి ఏమీ మిగ‌ల‌డం లేదు. అదే ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ను బ‌య‌ట చూడ‌కుండానే రీమేక్ చేస్తే.. ఇందులో చూసేందుకు  ఏముంది? అన్న‌ట్టుగా త‌యార‌వుతున్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి!