మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నక్క తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. తన కలల సౌధం అమరావతి కుప్ప కూలి పోతుండడంతో ఆయన గగ్గోలు పెడుతున్నాడు. జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రకటనతో చంద్రబాబు ఉక్కిబిక్కిరి అవుతున్నాడు. అమరావతిని విధ్వంసం చేస్తున్నారని వాపోతున్నాడే తప్ప మిగిలిన ప్రజానీకం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదు.
తెలంగాణ విభజన సమయంలో ఎలాగైతే తనకు తెలంగాణ, ఆంధ్రా రెండు కళ్లు అనే సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చాడో, ప్రస్తుతం ఆంధ్రాలో నెలకున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన మూడు కళ్ల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కార్ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా అనుకూలంగా, వ్యతిరేకంగా వాదోపవాదాలు, చర్చలు, రచ్చలు జరుగుతున్నాయి. ఇవేవీ చంద్రబాబుకు పట్టడం లేదు. అయితే ఆయన ఉద్దేశపూర్వకంగానే మూడు రాజధానులపై మౌనం పాటిస్తున్నాడు. ఎంతసేపూ ఆయన అమరావతిపై గోడు వెళ్లబోసుకుంటున్నాడు.
బంగారు బాతు లాంటి రాజధాని అమరావతిపై సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నాడని చంద్రబాబు మండిపడ్డాడు. రాజధానిగా అమరావతి ఉండదని జగన్ ఎక్కడా చెప్పలేదు. రాష్ట్రానికి మూడు రాజధానులు రావచ్చమో, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలని ఆయన అన్నాడు.
అమరావతి విధ్వంసానికి కుట్ర జరుగుతున్నదని ఆయన విరుచుకుపడ్డాడు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప పరిపాలన వికేంద్రీకరణ సరికాదని ఆయన చెప్పుకొచ్చాడు. మరి అన్నీ ఒకచోటే ఉంటే వికేంద్రీకరణ ఎలా సాధ్యమో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబే చెప్పాలి.
వైసీపీకి 151 సీట్లు వచ్చాయని సీఎం జగన్‌కు ఒళ్లంతా గర్వమని విమర్శించాడు. వైసీపీకి పెద్దసంఖ్యలో సీట్ల సంగతేమోగానీ, టీడీపీకి 23 సీట్లే వచ్చాయనే అక్కసు మాత్రం చంద్రబాబు మాటల్లో కనిపించింది. మూడు రాజధానులపై తప్ప మిగిలిన అన్ని విషయాలపై కన్వీనియంట్‌గా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.
బాబు మాటల తీరు గమనిస్తే తాను మూడు రాజధానులకు వ్యతిరేకం కాదని చెప్పేందుకు ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు అర్థమవుతోంది. అందుకే కేవలం అమరావతి ఒక్క విషయంపైనే మాట్లాడుతూ రాజధానుల గురించి మౌనం పాటిస్తున్నాడు.
ఎందుకంటే భవిష్యత్‌లో ఆయన మూడుకళ్ల సిద్ధాంతాన్ని ఒంట బట్టించుకోవాల్సి వస్తుంది. రాయలసీమ, తెలంగాణ, కోస్తా ప్రాంతాలు తనకు మూడు కళ్లలాంటివని ఆయన చెప్పబోతారు. మూడో కన్ను గురించి అడక్కండి. ఎందుకంటే ఆయనకు కోపం వస్తే మూడో కన్ను తెరిచేస్తాడు.